నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్‌ షో పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్లతో వరుస ఎపిసోడ్లు షూట్ చేసుకున్న ఆహా టీమ్...వాటిని స్ట్రీమ్ చేసుకునేందుకు ప్లాన్స్ చేసుకుంది. అయితే ఈ లోపే సామాజిక మాధ్యమాలు, వివిధ ప్రసార సాధనాల్లో టాక్ షో సీన్లు బయటకు వచ్చేస్తున్నాయి.


వీటన్నింటినీ పైరసీగానే భావించాలని కోరుతూ ఆహా తరపున అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టులో  పిటిషన్ వేసింది. అన్ అఫీషియల్ గా స్ట్రీమ్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, ప్రసార మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో ఢిల్లీ హైకోర్టును ఆహా లీగల్ టీమ్ కోరింది.


దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ‘అన్‌స్టాపబుల్‌’ షోకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ఉన్న అనధికారిక లింకులను తొలగించాలని  టెలికమ్యూనికేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్‌  ప్రొవైడర్లను ఆదేశించింది.


ఇక అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్‌లో ప్రభాస్‌కు సంబంధించిన ఎపిసోడ్ మొదటి భాగం స్ట్రీమింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఆహా యాప్‌లో ఈ ఎపిసోడ్‌ను స్ట్రీమ్ చేయవచ్చు. అయితే ఈ ఎపిసోడ్‌లో ఇది మొదటి భాగం మాత్రమే. రెండో భాగం జనవరి 6వ తేదీన స్ట్రీమ్ కానుంది.