Mukesh Ambani Villa In Dubai: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) అధినేత, భారత బిలియనీర్, దేశంలో రెండో అత్యంత ధనవంతుడు అయిన ముఖేష్ అంబానీ ఆస్తుల చిట్టా ఏటికేడు పెరుగుతూనే ఉంది. దుబాయ్‌లో ఉన్న తన రియల్‌ ఎస్టేట్‌ ఆస్తుల జాబితాలోకి ఈ లక్ష్మీపుత్రుడు మరో పేరును చేర్చారు. 


HT నివేదిక ప్రకారం.. దుబాయ్‌లో సూపర్‌ రిచ్‌ ప్రాంతమైన పామ్ జుమేరా ద్వీపంలో (Palm Jumeirah Island) ఒక అధునాతన, అత్యంత విలాసవంతమైన విల్లాను ముఖేష్‌ అంబానీ కొన్నారు. 163 మిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ. 1,350 కోట్లు) కొనుగోలు చేశారట.


ఎంత చెప్పినా తక్కువే..!
స్టార్‌బక్స్ (Starbucks) హెచ్&ఎం ‍‌(H&M ), విక్టోరియాస్‌ సీక్రెట్ (Victoria's Secret) వంటి గ్లోబల్‌ రిటైల్ బ్రాండ్‌లకు లోకల్‌ ఫ్రాంచైజీలను నడుపుతున్న కువైట్ టైకూన్ మహమ్మద్ అల్షాయా కుటుంబం నుంచి ఈ మాన్షన్‌ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ గత వారం ఖరీదు చేశారు. బీచ్‌ ఫేసింగ్‌తో ఉన్న విల్లా ఇది.


అంబానీ కొనుగోలు చేసిన కొత్త దుబాయ్ ఆస్తిలో... 10 బెడ్‌ రూమ్‌లు, 18 బాత్‌రూమ్‌లు, ప్రైవేట్ స్పా, ఇండోర్ & అవుట్‌డోర్ స్విమ్మింగ్‌ పూల్స్‌, వ్యాయామశాల, సినిమా థియేటర్, బౌలింగ్ అల్లే, జాకుజీ ఉన్నాయని తెలుస్తోంది. బేస్‌మెంట్‌లో 15 కార్లను పార్క్‌ చేసుకోవచ్చట.


లేటెస్ట్ అప్‌డేట్‌ ప్రకారం, 163 మిలియన్‌ డాలర్లకు ఒక లావిష్‌ విల్లా అమ్ముడుపోయిందని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించింది. అయితే, కొనుగోలుదారుడి గుర్తింపును వెల్లడించలేదు. 


గతంలో, ఇదే ప్రాంతంలో 80 మిలియన్‌ డాలర్ల విలువైన నివాసాన్ని తన కుమారుడు అనంత్‌ అంబానీ కోసం ముఖేష్‌ కొన్నారు. ఆ విల్లాకు నడిచి వెళ్లేంత దగ్గరలోనే ఇప్పుడు కొన్న విల్లా ఉందని సమాచారం.


పామ్‌ జుమేరా ద్వీపం
సముద్రంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన దీవుల సముదాయమే పామ్‌ జుమేరా ద్వీపం. ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాంతం పామ్‌ చెట్టు ఆకారంలో కనిపిస్తుంది. దుబాయ్‌కి గుర్తుగా కావాలనే ఇలా నిర్మించారు. ఇందులో ఉన్నవన్నీ విలాసవంత విల్లాలే. ప్రపంచ స్థాయి ఐశ్వర్యవంతులు మాత్రమే ఇందులో ఆస్తిని కొనగలరు. అన్ని రకాల అధునాతన సదుపాయాలు, గ్లోబల్‌ ఇంటీరియర్‌ డిజైనింగ్‌తో ఇక్కడి విల్లాలను నిర్మిస్తారు. వీటి నుంచి చూస్తే సముద్రం ప్రశాంతంగా కనిపిస్తూ, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.


UAE జనాభాలో విదేశీయులే 80 శాతం మంది ఉన్నారు. వీళ్లే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. దుబాయ్ రియల్ ఎస్టేట్ కొనుగోలుదారుల్లో భారతీయులది అగ్రస్థానం.


అంబానీ విదేశీ ఆస్తులు
ముఖేష్‌ అంబానీ విదేశీ ఆస్తుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గతేడాది, బ్రిటన్‌లో 300 ఎకరాల్లోని ‘స్టోక్‌ పార్క్‌’ను 79 మిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేశారు. న్యూయార్క్‌లోనూ ఒక భవంతి కోసం అంబానీ అన్వేషిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. 


స్టాక్‌ మార్కెట్‌లో, ఇవాళ (గురువారం) ఉదయం 10.35 గంటల సమయానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర ఫ్లాట్‌గా రూ. 2,498.40 దగ్గర ఉంది.