మారుతున్న కాలానికి అనుగుణంగా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో సంస్కరణలు తెచ్చేందుకు రక్షణశాఖ నడుం బిగించింది. కొందరు నిపుణులు, అనుభవజ్ఞులు, ప్రముఖులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ పార్లమెంటేరియన్ బైజయంత్ పాండాను ఈ సమగ్ర సమీక్ష కమిటీకి ఛైర్మన్‌గా నియమించింది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా, మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకీ చోటిచ్చింది.
మహీంద్రా, ధోనీకి కమిటీలో చోటిచ్చేందుకు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఎంఎస్ ధోనీ టీమ్‌ఇండియాకు సుదీర్ఘ కాలం సారథిగా సేవలందించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్‌లు అందించాడు. ప్రస్తుతం టెరిటోరియల్ సైన్యంలో గౌరవ లెఫ్ట్‌నెంట్ కల్నల్‌గా సేవలు అందిస్తున్నాడు. 2019లో భారత సైన్యం ప్యారాచూట్ రెజిమెంట్‌లో నెలరోజులు శిక్షణ పొందాడు. పాఠశాలలో చదువుతున్నప్పుడు ఎన్‌సీసీలోనూ అతడు పనిచేయం గమనార్హం. గతంలో సైన్యం గురించి ట్వీట్లూ చేశాడు.
Also Read: SBI Home Loan: శుభవార్త! ఇంటి రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్‌బీఐ.. ఎంత ఆదా చేసుకోవచ్చంటే!
ఇక ఆనంద్ మహీంద్రా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కీలకంగా ఉంటున్నారు. తమ సంస్థ ద్వారా సైనికులు, సైన్యం కోసం ప్రత్యేక వాహనాలు, ఇతర సాధనాలను రూపొందిస్తున్నారు. భారత సైన్యంలో మూడేళ్లు సేవలందించేందుకు సౌధారణ పౌరులకు అనుమతివ్వాలన్న ప్రతిపాదనకు ఆయన మద్దతు ఇచ్చారు. అలా పనిచేసి తిరిగొచ్చిన వాళ్లకు మహీంద్రా గ్రూప్‌లో ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పైగా మహీంద్రా డిఫెన్స్ అధికారులు గతవారం సైన్యాధిపతి ఎంఎం నరవణెను కలిసిన సంగతి తెలిసిందే.
బీజేపీ ఎంపీ, కల్నల్ (రిటైర్డ్) రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్, రాజ్య సభ్య ఎంపీ సహస్రబుద్ధే, ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్, జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్స్‌లర్ నజ్మా అక్తర్, ఎన్‌డీటీ మహిళల విశ్వవిద్యాలయం మాజీ వీసీ వసుధా కామత్, ముకుల్ కనితర్, మేజర్ జనరల్ (రిటైర్డ్) అలోక్ రాజ్, డీఐసీసీఐ ఛైర్మన్ మిలింద్ కాంబ్లే తదితరులు ఈ కమిటీలో సభ్యులు.