భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) వినియోగదారులకు శుభవార్త చెప్పింది! దసరా, దీపావళి సమీపిస్తున్న తరుణంలో పండుగ ఆఫర్లు ప్రకటించింది. గృహరుణాలపై వడ్డీని తగ్గించింది. పండుగ సీజన్లో ఎక్కువ మందికి రుణాలు అందించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. రుణ మొత్తంతో సంబంధం లేకుండా క్రెడిట్ స్కోరు ఆధారిత ఇంటి రుణాలపై వడ్డీని 6.70 శాతానికి తగ్గించింది.
గతంలో రూ.75 లక్షలకు పైగా గృహరుణం తీసుకొనే వారు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుత పండుగ ఆఫర్లతో ఇంటి రుణాన్ని ఇప్పుడు 6.70 శాతం వడ్డీతోనే పొందొచ్చు. ఈ ఆఫర్ల వల్ల 45 బేసిస్ పాయింట్ల మేర డబ్బును ఆదా చేసుకోవచ్చు. అంటే 30 ఏళ్ల కాలపరిమితితో తీసుకొనే రూ.75 లక్షల రుణంపై రూ.8 లక్షల కన్నా ఎక్కువగా ఆదా చేసుకోవచ్చు.
వినియోగదారులకు మరో ప్రయోజనం ఏంటంటే.. గతంలో వేతన జీవుల కన్నా ఇతరులు ఇంటి రుణం తీసుకుంటే 15 బేసిస్ పాయింట్ల మేర అధికంగా వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడా అంతరాన్ని ఎస్‌బీఐ తొలగించింది. ఇకపై అందరికీ ఒకే రకమైన వడ్డీరేటు అమలు చేయనున్నారు. అంటే ఉద్యోగేతరులు 45+15 మొత్తంగా 60 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ డబ్బును ఆదా చేసుకోవచ్చు! ఈ రుణాల ప్రాసెసింగ్ ఫీజునూ పూర్తిగా రద్దు చేయడం మరో విశేషం. క్రెడిట్ స్కోరు ఆధారంగా రుణాలు తీసుకొనే వారికీ వడ్డీపై ఆకర్షణీయమైన రాయితీలు ప్రకటించడం గమనార్హం.
అందరికీ అందుబాటులో రుణాలు..
'మా గృహ రుణ వినియోగదారులకు పండుగ ఆఫర్లు ప్రకటించినందుకు సంతోషంగా ఉంది. సాధారణంగా కొన్ని పరిమితుల వరకే రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై రాయితీ ఇచ్చేవాళ్లం. పైగా అది వారి ప్రొఫెషన్, చేసే పనిని బట్టి ఉండేది. కానీ ఈ సారి మాత్రం అందరికీ ఆఫర్లు వర్తింపజేశాం. బదిలీ చేసుకున్న రుణాలకూ 6.7శాతం రాయితీ వర్తింపజేస్తున్నాం. ఈ పండుగ సీజన్లో జీరో ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీపై రాయితీలు ఇవ్వడంతో గృహ రుణాలు మరింత అందుబాటులోకి వస్తాయి. కరోనాను దేశం ధైర్యంగా ఎదుర్కొంది. అందుకే అందరికీ సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు మావంతు సాయం చేస్తున్నాం' అని ఎస్‌బీఐ రిటైల్, డిజిటల్ బ్యాంకింగ్ ఎండీ సీఎస్ శెట్టి అన్నారు.