Most Expensive Stock: భారత స్టాక్ మార్కెట్లోనే అత్యంత ఖరీదైన ఒక స్టాక్ ఇప్పుడు మంచి బూమ్‌లో ఉంది, లక్ష రూపాయలకు చేరువైంది. ఈ షేర్ ఒక లక్ష రూపాయల మైలురాయిని చేరితే, భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఆ ఘనత సాధించిన మొదటి కంపెనీగా నిలుస్తుంది.
ఇవాళ (సోమవారం, 8 మే 2023), మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి MRF షేర్ ధర 0.93% పడిపోయి రూ. 97,701 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ రోజు దీని గరిష్ట స్థాయి రూ. 99,933.50, కనిష్ట స్థాయి రూ. 97,699.05.
కొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి
MRF షేర్లు ఇవాళ రూ. 98,620 వద్ద ప్రారంభమయ్యాయి, కొద్ది సేపట్లోనే రూ. 99,933.50 వద్ద కొత్త 52-వారాల గరిష్ట స్థాయిని (ఒక సంవత్సరం గరిష్ట స్థాయి) తాకాయి.
MRF కౌంటర్ గత ఐదు రోజుల్లో దాదాపు 10 శాతం లాభపడింది. గత నెల రోజుల్లో ఈ షేరు 16 శాతం వరకు జంప్ చేయగా, గత ఒక సంవత్సర కాలంలో 42 శాతం పైగా పెరిగింది.
23 ఏళ్లలో అతి భారీగా పెరిగిన స్టాక్ ధర
టైర్ మేకర్ MRF స్టాక్ ప్రైస్ 2000 సంవత్సరంలో రూ. 1000 వద్ద ఉంది. 2010లో వేగంగా దూసుకెళ్లి ఒక్కో షేరు రూ. 9 వేలకు చేరుకుంది. 2014లో, MRF షేరు ధర రూ. 37,000 పైన ఉంది. 2016లో ఇది 50 వేల రూపాయలకు చేరుకుంది. 2018లో ఈ స్క్రిప్ 78 వేలకు పైగా రేటు వద్ద ట్రేడయింది. 2021లో ఒక్కో షేరు రూ. 92 వేలను చేరుకుంది, ఇప్పుడు 1 లక్ష రూపాయలకు దగ్గరగా ఉంది.
ఒకప్పుడు ఈ షేర్ విలువ 11 రూపాయలు
MRF షేరు ధర 1993 ఏప్రిల్ 27న రూ. 11 వద్ద లిస్ట్ అయింది. ఇప్పుడు లక్షకు చేరువైంది. దీనిని బట్టి, ఈ 30 ఏళ్లలో షేర్లు ఎంత వేగంగా పెరిగాయో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు, ఒక నాణ్యమైన స్టాక్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి ఎంత భారీ లాభాలను తెచ్చిస్తుందో కూడా ఇది రుజువు చేస్తోంది.
ఏంజెల్ వన్ ప్రకారం, స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ తర్వాత ఇప్పటివరకు, ఈ కంపెనీ దాని షేర్ ధరను విభజించలేదు, ఈ కారణంగానే అవి చాలా ఖరీదుగా కొనసాగుతున్నాయి.
కంపెనీ ఎప్పుడు ప్రారంభమైంది?
MRF కంపెనీ 1946లో ఏర్పాటైంది, తొలినాళ్లలో బెలూన్‌లను తయారు చేసింది. 1960లో టైర్ల తయారీని ప్రారంభించింది. ఇది ఇప్పుడు రూ. 4.17 లక్షల కోట్లతో మార్కెట్ విలువతో భారతదేశపు అగ్రగామి టైర్ల తయారీ సంస్థగా నిలిచింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.