Car Companies Set To Hike Prices From 2024: మీ మనస్సు మెచ్చిన కారు కొత్త ఏడాది (2024) కల్లా మీ ఇంటి ముందు ఉండాలని ప్లాన్‌ చేస్తున్నారా?. అయితే, షోరూమ్‌కు వెళ్లడంలో తాత్సారం చేయొద్దు. నూతన సంవత్సరం నుంచి కారు ధరలు పెంచేందుకు ‍‌(Car prices to increase from New Year) కొన్ని ఆటో కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.


ప్రస్తుతానికి, ఫోర్‌-వీలర్ల ప్రైస్‌ పెంచబోతున్న కంపెనీల లిస్ట్‌లో మారుతి సుజుకి ‍‌(Maruti Suzuki), మహీంద్ర (Mahindra), టాటా మోటార్స్‌ (Tata Motors), మెర్సిడెస్‌ బెంజ్‌ (Mercedes Benz), ఆడి (Audi) ఉన్నాయి. రేట్ల  పెంపు విషయాన్ని ఈ కంపెనీలు అధికారికంగా ప్రకటించాయి కూడా. మరికొన్ని కార్‌ కంపెనీలు కూడా ఈ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది.


మారుతి సుజుకి ఇండియా, సోమవారం (నవంబర్ 27, 2023) BSEకి ఇచ్చిన సమాచారం ప్రకారం... పెరిగిన ద్రవ్యోల్బణం (inflation), కమొడిటీ ధరల (commodity prices) కారణంగా కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. ఖర్చుల ఒత్తిడిని కస్టమర్లకు బదిలీ చేయాలని కంపెనీ భావిస్తోంది. దానికి అనుగుణంగా, 2024 జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. దీనివల్ల కంపెనీ మీద వ్యయాల భారం కొంత వరకు తగ్గుతుంది, ఇప్పటికే అదనంగా పెట్టిన ఖర్చులు తిరిగి వస్తాయి.


మారుతి సుజుకి కార్ల ధరలు (Maruti Suzuki cars price range 2023)
అయితే, ఏయే మోడళ్ల రేట్లు పెరుగుతాయో మారుతి సుజుకి వెల్లడించలేదు. మోడల్‌ను బట్టి రేట్ల పెంపు శాతం మారుతుందని BSE ఫైలింగ్‌లో చెప్పింది. చివరిసారిగా, ఈ ఏడాది ఏప్రిల్ 1న తన కార్ల ధరలను మారుతి సుజుకి పెంచింది. అప్పుడు, మోడల్‌ను బట్టి 0.8% వరకు ధరలు పెంచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతం వరకు రేట్లు హైక్‌ చేసింది. 


ఎంట్రీ-లెవెల్‌ (entry-level) చిన్న కారు ‍‌ఆల్టో నుంచి మల్టీ యుటిలిటీ వెహికల్‌ (Multi Utility Vehicle - MUV) ఇన్విక్టో వరకు మారుతి అమ్ముతోంది. ఐకానిక్ మారుతి 800తో ప్రారంభమైన ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుడు 150కి పైగా వేరియంట్‌లతో 16 కార్ మోడళ్లు ఉన్నాయి. వీటి ప్రైస్‌ రేంజ్‌ రూ.3.54 లక్షల నుంచి రూ.28.42 లక్షల (ఎక్స్‌షోరూం, దిల్లీ) వరకు ఉంటుంది.


మారుతి రూట్‌లోనే మరికొన్ని ఆటో కంపెనీలు
ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరల పెరుగుదల వల్ల తమ కార్ల రేట్లను 2024 జనవరి నుంచి పెంచాలని భావిస్తున్నామని మహీంద్ర (Mahindra cars price 2023) కూడా ప్రకటించింది. టాటా మోటార్స్‌ కూడా (Tata Motors cars price 2023), తన ప్యాసింజర్‌ వెహికల్స్‌తో పాటు ఎలక్ట్రిక్‌ కార్‌ రేట్లను పెంచే ప్లాన్‌లో ఉంది. జనవరి నుంచి రేట్ల పెంపు ఆలోచనలో ఉన్నట్లు మెర్సిడెస్‌ బెంజ్‌ గతంలోనే చెప్పింది. మహీంద్ర, టాటా మోటార్స్‌, బెంజ్‌ కార్ల కొత్త రేట్ల లిస్ట్‌ మరికొన్ని వారాల్లో బయటకు రావచ్చు. జర్మనీకి చెందిన లగ్జరీ కార్‌ మాన్యుఫాక్చరర్‌ ఆడి కూడా జనవరి నుంచి రేట్లను 2% వరకు పెంచబోతోంది. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply