Nestle India Q1 Results: FMCG మేజర్ నెస్లే ఇండియా, ఇవాళ (మంగళవారం, 25 ఏప్రిల్‌ 2023) తొలి త్రైమాసికం లేదా మార్చి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభం సంవత్సరానికి (YoY) 24.7% పెరిగి రూ. 737 కోట్లకు చేరుకోగా, మొత్తం అమ్మకాలు 21.3% పెరిగి రూ. 4,808 కోట్లకు చేరుకున్నాయి.


బాటమ్‌ లైన్‌లో రూ. 588 కోట్లు, టాప్‌ లైన్‌లో రూ. 4,424 కోట్లు ఉండొచ్చని మార్కెట్‌ అంచనా వేస్తే, అంతకంటే మెరుగైన ఫలితాలను ఈ కంపెనీ ప్రకటించింది. 


నెస్లే ఇండియా, క్యాలెండర్‌ సంవత్సరాన్ని ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. కాబట్టి, జనవరి-మార్చి త్రైమాసికం ఈ కంపెనీకి తొలి త్రైమాసికం అవుతుంది.


గత దశాబ్దంలో ఉత్తమ త్రైమాసిక ఫలితాలు
2015లోని లో బేస్‌లో కారణంగా 2016లో సాధించిన అసాధారణ త్రైమాసికాన్ని మినహాయిస్తే... గత 10 సంవత్సరాల్లో నెస్లే ఇండియాకు కంపెనీకి ఇదే అత్యధిక త్రైమాసిక వృద్ధిగా నెస్లే ఇండియా ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ ప్రకటించారు.


"అన్ని సెగ్మెంట్లు రెండంకెల వృద్ధిని అందించాయి. KITKAT, MUNCH సహా తీపి తినుబండారాలు బలమైన వృద్ధిని నమోదు చేశాయి. పానీయాల విభాగం మరో బలమైన త్రైమాసికాన్ని నమోదు చేసింది. నెస్‌కెఫే నేతృత్వంలో బలమైన వృద్ధి, మార్కెట్ వాటా లాభం సాధించాం" - సురేష్ నారాయణన్


వంట నూనెలు, గోధుమలు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ వంటి కమోడిటీల ధరలు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నట్లు మ్యాగీ మేకర్‌ తెలిపింది. అయితే, పాలు, ఇంధనాలు, గ్రీన్ కాఫీ ధరలు స్థిరంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు త్రైమాసిక ఫలితాల సందర్భంగా వెల్లడించింది.


నెస్లే అవుట్-ఆఫ్-హోమ్ (OOH) వ్యాపారం కూడా మార్చి త్రైమాసికంలో వేగంగా కొనసాగింది.


విస్తరణ ప్రయత్నాలకు ఊతం
"ఈ-కామర్స్‌లో బలమైన పనితీరు కొనసాగింది. రూర్బన్‌ ప్రయాణాన్ని వేగవంతం చేశాం. మెట్రో & మెగా నగరాల్లో వ్యాపారం విస్తరిస్తోంది. గ్రామీణ వృద్ధి కూడా బలంగా ఉంది. వ్యాపారాన్ని విస్తరించాలన్న మా ప్రయత్నాలకు మరింత విశ్వాసం, ప్రోత్సాహం లభించింది" - సురేష్ నారాయణన్


అంతకుముందు, ఈ నెల 12న, ఒక్కో షేరుకు రూ. 27 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను నెస్లే ఇండియా ప్రకటించింది. వచ్చే నెల 8వ తేదీ నుంచి దీని చెల్లింపు ప్రారంభం అవుతుంది. 2022 సంవత్సరం కోసం, కంపెనీ AGMలో ఆమోదించిన రూ. 75 తుది డివిడెండ్‌తో కలిపి దీనిని చెల్లిస్తారు.


మార్చి త్రైమాసికం నంబర్ల ప్రకటన తర్వాత, నెస్లే స్టాక్ ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 0.22% నష్టంతో రూ. 20,619.20 వద్ద ఉంది. 


గత ఒక ఏడాది కాలంలో ఈ స్టాక్‌ దాదాపు 14% ఆరోగ్యకరమైన రాబడితో మెరుగైన పనితీరు కనబరిచింది. గత ఆరు నెలల కాలంలో దాదాపు 2% లాభపడింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.