Lulu Group: UAEకి చెందిన బిలియనీర్‌ యూసఫ్‌ అలీకి చెందిన లులూ గ్రూప్‌ (Lulu Group), మన దేశ రిటైల్‌ సెక్టార్‌లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. త్వరలో అహ్మదాబాద్‌లో (గుజరాత్‌‌) ఒక మాల్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ గ్రూప్‌నకు ఇప్పటికే  కోచి (కేరళ)‌, లఖ్‌నవూలో (ఉత్తరప్రదేశ్‌) మాల్స్‌ ఉన్నాయి. గుజరాత్‌ మాల్‌ మూడోది అవుతుంది. 


లులూ మాల్‌ అంటే ఆషామాషీగా ఉండదు. ఇదొక హైపర్‌ మార్కెట్‌. ప్రముఖ గ్లోబల్‌ బ్రాండ్స్‌, ఫుడ్‌ కోర్టులు, గేమింగ్‌ సెంటర్స్‌, మూవీ థియేటర్స్‌... ఇలా అన్ని రకాల మోడర్న్‌ ఫెసిలిటీస్‌తో ఒక సిటీని తలపిస్తుంది. ఒక ఫ్యామిలీ లులూ మాల్‌కు వెళితే ఒక రోజంతా అక్కడ ఉల్లాసంగా గడిపేలా వాతావరణం ఉంటుంది. 


ఇండియన్‌ రిటైల్‌ సెక్టార్‌లో అభివృద్ధికి చాలా స్పేస్‌ ఉందని, మరో 12 మాల్స్‌ను ఇండియాలో ఏర్పాటు చేస్తామని ఈ ఏడాది ఆగస్టులో లులూ కంపెనీ ప్రకటించింది. అందులో భాగంగానే, మూడో మాల్‌ కోసం గుజరాత్‌లో అడుగు పెట్టబోతోంది.


దేశంలోనే అతి పెద్ద మాల్‌


లులూ అహ్మదాబాద్‌ మాల్‌ భారత్‌లోనే అతి పెద్ద షాపింగ్‌ మాల్‌ అవుతుంది. దీని ఏర్పాటు కోసం 3,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. ఈ మాల్‌ విస్తీర్ణం దాదాపు 3 మిలియన్‌ చదరపు అడుగులు ఉండొచ్చు. ప్రస్తుతం, భూమి కొనుగోలు కోసం కంపెనీ తుది దశ చర్చలు జరుపుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో షాపింగ్‌ మాల్‌ నిర్మాణానికి పునాది రాయి వేస్తామని లులూ గ్రూప్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌, కమ్యూనికేషన్స్‌) నందకుమార్‌ తెలిపారు.


అహ్మదాబాద్‌ లులూ మాల్‌లో 300కు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను కస్టమర్లకు అందుబాటులో ఉంచనున్నారు. 3000 మంది తినగలిగే సామర్థ్యం ఉన్న ఫుడ్‌ కోర్ట్‌, ఐమ్యాక్స్‌ సహా 15 స్క్రీన్‌ మల్టీప్లెక్స్‌, చిన్న పిల్లల కోసం దేశంలోనే అతి పెద్ద అమ్యూజ్‌మెంట్‌ సెంటర్‌, ఇంకా చాలా అట్రాక్షన్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మాల్‌ ద్వారా ప్రత్యక్షంగా 6,000 మందికి పరోక్షంగా 12,000 మందికి ఉపాధి కల్పించనున్నారు. 


గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవల UAEలో నిర్వహించిన రోడ్‌ షోలో, రూ.3,000 కోట్లతో అహ్మదాబాద్‌లో మాల్‌ ఏర్పాటుకు లులూ గ్రూప్‌తో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.


దక్షిణాదిలో ఉనికి


దక్షిణ భారత దేశానికి లులూ గ్రూప్‌ కొత్తదేమీ కాదు. సూపర్‌మార్కెట్‌ల రూపంలో కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాల్లో లులూ గ్రూప్‌ వ్యాపారం చేస్తోంది. కొచ్చి, బెంగళూరు, తిరువనంతపురం నగరాల్లో సూపర్ మార్కెట్‌లను నడుపుతోంది. ఈ సంవత్సరం జులైలో లఖ్‌నవూలో పెద్ద హైపర్‌ మార్కెట్‌ను ఓపెన్‌ చేసింది. ఈ మాల్స్‌ విస్తీర్ణం దాదాపు 3.7 మిలియన్‌ చదరపు అడుగులు. వీటిపై కంపెనీ దాదాపు 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఉత్తరాదిలోనూ స్థిరపడేందుకు వ్యాపారాన్ని విస్తరిస్తోంది.


లులూ గ్రూప్‌ ఎదుగుదలను ఇండియన్‌ కంపెనీలకు, ముఖ్యంగా లిస్టెడ్ స్పేస్‌లో ఉన్న రిలయన్స్‌ రిటైల్‌, డీమార్ట్‌, వి మార్ట్‌ వంటి రిటైల్‌ ఛైన్లకు గట్టి పోటీగా భావించాలి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.