చిన్న వ్యాపారులు, రెస్టారెంట్ నిర్వాహకులకు కాస్త ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధర రూ. 91 తగ్గింది. ఈ మేరకు చమురు మార్కెటింగ్ సంస్థలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. మరోవైపు విమాన ఇంధన (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌-ఏటీఎఫ్‌) ధరను రికార్డు స్థాయిలో 8.5 శాతం పెంచాయి. 







ఈ నిర్ణయంతో దేశ రాజధానిలో రూ.2000కుపైగా ఉన్న వాణిజ్య సిలిండిర్​ ధర రూ.1907కు తగ్గింది. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.


కమర్షియల్ సిలిండర్​ ధర తరచూ పెరగడం వల్ల చిన్న వ్యాపారస్థులు, హెటల్స్, రెస్టారెంట్​ నిర్వాహకులపై భారం పెరుగుతూ వస్తోంది. ధర తగ్గింపుతో వారికి కాస్త ఉపశమనం లభించనుంది.


ప్రస్తుతం హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర చూస్తే రూ.952 కాగా, కమర్షియల్ సిలిండర్ ధర రూ.2087. అక్టోబర్ నుంచి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర పెరగట్లేదు. ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా... గ్యాస్ సిలిండర్ ధరల్ని మాత్రం పెంచట్లేదు. కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడం విశేషం.


ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని సామాన్యులపై భారం మోపకుండా గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచట్లేదన్న వార్తలు వస్తున్నాయి. 


పెరిగిన విమాన ఇంధన ధర..


మరోవైపు విమాన ఇంధన ధర భారీగా పెరిగింది. దిల్లీలో కిలో లీటర్​ ఏటీఎఫ్ ధర రూ. 6,743 పెరిగింది. అంటే ప్రస్తుతం కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ86,038కి చేరింది. ఏటీఎఫ్​ చరిత్రలో ఇదే అత్యధిక ధర. అంతర్జాతీయంగా క్రూడ్​ ఆయిల్ ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. తాజా పెంపుతో విమాన ఇంధన ధర నెల రోజుల వ్యవధిలో మూడోసారి పెరిగినట్లయింది. 


Also Read: Income Tax, Union Budget 2022: ఆదాయ పన్ను! మనం ఏం అడిగాం? నిర్మలమ్మ ఏం వడ్డించింది...?


Also Read: Budget 2022: గుడ్ న్యూస్.. 80 లక్షల ఇళ్ల నిర్మాణం.. రూ.44 వేల కోట్లు కేటాయింపు