LPG Cylinder Price Hike From 01 October 2024: భారతీయులకు అక్టోబర్‌ నెల చాలా కీలకం. ఈ నెలలో దసరా, దీపావళి వంటి కీలక పండుగలు ఉన్నాయి. చదువుల కోసం, సంపాదన కోసం ఎక్కడెక్కడో స్థిరపడ్డ వాళ్లంతా తిరిగి స్వగ్రామాలకు చేరతారు. చాలా ఇళ్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కళకళలాడతాయి. కాబట్టి, ఈ నెలలో వంట గ్యాస్‌ అవసరం పెరుగుతుంది. అయితే, ఈ నెల ఒకటో తేదీన (అక్టోబర్‌ 01, 2024) గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్‌ రేటు రూ.48.50 (Commercial LPG Cylinder Price Today) పెరిగింది. అయితే, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కిలోల గ్యాస్ సిలిండర్‌ మీదే రేటు పెంచారు. ఇళ్లలో వంటకు ఉపయోగించే 14 కేజీల సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. 


LPG సిలిండర్ల కొత్త రేట్లు ఈ రోజు (01 అక్టోబర్ 2024) నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. 


దేశంలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ ధరలు ఎంత పెరిగాయి?



  • దేశ రాజధాని దిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1740కి చేరింది, రూ.48.50 పెరిగింది. గత నెల, సెప్టెంబర్‌లో దీని ధర రూ.1691.50. 

  • కోల్‌కతాలో 19 కేజీల సిలిండర్ రేటు ఇప్పుడు రూ. 1850.50కి చేరింది, రూ.48 పెరిగింది. గత నెలలో ఇది రూ.1802.50గా ఉంది.

  • ముంబైలో ఎల్‌పీజీ సిలిండర్ ప్రైస్‌ ఇప్పుడు 1692 రూపాయలుగా ఉంది, 48 రూపాయలు పెరిగింది. సెప్టెంబర్‌లో రూ.1644కు సిలిండర్‌ దొరికింది.

  • చెన్నైలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1903కి చేరింది, 48 రూపాయలు జంప్‌ చేసింది. గత నెలలో ఈ ధర రూ.1855.


వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదల కారణంగా రెస్టారెంట్లు, హోటళ్లు, ధాబాల్లో ఆహారం ధరలు పెరగొచ్చు.


మూడు నెలలుగా పెరుగుతూనే ఉన్న రేట్లు
అక్టోబర్‌ సహా గత మూడు నెలల నుంచి కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెంచుతూనే ఉన్నాయి. సెప్టెంబర్‌లో ఒక్కో సిలిండర్‌కు రూ.39, ఆగస్టులో రూ.9 చొప్పున పెరిగాయి.


సాధారణ ప్రజలకు ఉపశమనం
నివాస గృహాల్లో వంటకు ఉపయోగించే 14.2 కిలోల బరువున్న సాధారణ LPG సిలిండర్ రేటును  ‍(Domestic LPG Cylinder Price Today) సర్కారు పెంచలేదు. 6 నెలలుగా రెడ్‌ సిలిండర్‌ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.


తెలుగు రాష్ట్రాల్లో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ రేట్లు        
హైదరాబాద్‌లో 14.2 కేజీల రెడ్‌ సిలిండర్ రేటు ‍‌(14 KGs Gas Cylinder Price In Hyderabad) రూ.855గా ఉంది. విజయవాడలో ఇదే బండ కోసం ‍‌(14 KGs Gas Cylinder Price In Vijayawada) రూ.855 చెల్లించాలి. 


14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్ ధర దిల్లీలో రూ. 803, కోల్‌కతాలో రూ. 803, ముంబైలో రూ. 802.50, చెన్నైలో రూ. 818.50 గా ఉంది.


దేశీయ, వాణిజ్య LPG సిలిండర్‌ ధరల సమాచారానికి మూలం: ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ iocl.com.


మరో ఆసక్తికర కథనం: గోల్డ్‌ కొనేవారికి వెరీ 'గుడ్‌ న్యూస్‌' - ఈ రోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు