Nuvvula Annam Recipe : దసరా (Dussehra 2024) సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వంటకాల్లో నువ్వుల అన్నం కూడా ఒకటిగా చెప్తారు. అయితే దీనిని చేయడం చాలా తేలిక. దీనిని ప్రసాదంగానే కాకుండా ఆరోగ్య ప్రయోజనాల కోసం రెగ్యూలర్​గా చేసుకోవచ్చు. పిల్లలు నుంచి పెద్దలవరకు అందరూ దీనివల్ల బెనిఫిట్స్ పొందుతారు. కాల్షియం, విటమిన్ డి ఈ రైస్​నుంచి అందుతుంది. మరి ఈ టేస్టీ, హెల్తీ ప్రసాదాన్ని.. అమ్మవారికి నచ్చేలా ఎలా చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


నల్ల నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు


ఎండుమిర్చి - 7 


మినపప్పు - రెండు టేబుల్ స్పూన్లు


కరివేపాకు - రెండు రెబ్బలు


ఇంగువ - రెండు చిటికెడు


ఉప్పు - రుచికి తగినంత


అన్నం - ఒకటిన్నర కప్పులు 


నూనె - మూడు టేబుల్ స్పూన్లు 


చల్ల మిరపకాయలు - 3


ఆవాలు - పావు టీస్పూన్ 


మినపప్పు - 1 టీస్పూన్ 


పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్


జీలకర్ర - 1 టీస్పూన్


కరివేపాకు - 1 రెబ్బ


తయారీ విధానం


ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టుకోవాలి. దానిలో ఎండుమిర్చి వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేసి వేయించుకోవాలి. సాధారణంగా దీనిని నల్లని నువ్వులు లేదా తెల్లని నువ్వులతో చేస్తారు. కానీ అందుబాటులో ఉంటే నల్లని నువ్వులతోనే ఈ రెసిపీని ట్రై చేయండి. కుదలేదు అనుకున్నప్పుడు తెల్లని నువ్వులతో కూడా దీనిని చేసుకోవచ్చు. 


పాన్​లో నువ్వులు వేసి.. అవి వేగుతున్న సమయంలో రెండు కరివేపాకు రెబ్బలు వేయాలి. నువ్వులు చిటపటలాడుతూ విచ్చుకుంటున్న సమయంలో ఇంగువ వేయాలి. ఇవి వేగిన తర్వాత.. ముందుగా వేయించుకున్న ఇతర పదార్థాలను, నువ్వులను మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. దానిలో రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని స్టోర్ చేసుకుని.. నువ్వుల అన్నం తినాలనుకున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ప్రసాదంగా చేసేప్పుడు మాత్రం అప్పటికప్పుడే చేయాలి. 


ఇలా నువ్వుల పొడిని సిద్ధం చేసుకున్న తర్వాత.. ప్రసాదంగా చేసుకునేప్పుడు అప్పుడే వండిన రైస్ తీసుకోవాలి. దానిలో ఈ పొడిని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. దానిలో నూనె వేయాలి. అనంతరం మిరపకాయలు వేయాలి. మీరు రెగ్యూలర్​గా చేసుకోవాలనుకుంటే చల్ల మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. ఇవి నువ్వుల అన్నంలో మంచి రుచిని ఇస్తాయి. అయితే ప్రసాదంగా చేసేప్పుడు నార్మల్​ ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. వాటిలో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి వేయించుకోవాలి. చివర్లో జీలకర్ర, కరివేపాకు వేసి తాళింపు వేసుకోవాలి. ఈ తాళింపులో నువ్వుల అన్నం వేసి కలుపుకోవాలి. అంతే టేస్టీ నువ్వుల అన్నం రెడీ. 



దసరా సమయంలో దీనిని అమ్మవారికి పెడితే చాలా సంతోషిస్తారట. అలాగే ఇది కేవలం ప్రసాదంగానే కాకుండా రెగ్యూలర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని చేసుకోవచ్చు. రెగ్యూలర్ రెసిపీలు బోర్ కొట్టినా.. హెల్తీగా ఏమైనా తినాలనుకున్నా దీనిని హాయిగా చేసుకుని లాగించేయవచ్చు. 


Also Read : రుచికరమైన లడ్డూ కోసం ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది