Laddu Making Process : తిరుపతి లడ్డూను ఒక్కసారి రుచి చూస్తే.. ప్రసాదాలందూ తిరుపతి లడ్డూ వేరయా అనాల్సిందే. అవును ప్రపంచవ్యాప్తంగా స్వామివారికి ఎంత గుర్తింపు ఉందో.. అక్కడ దొరికే ప్రసాదానికి అంతే పేరు ఉంది. అయితే ఈ తిరుపతి లడ్డూపై ఇప్పుడు జరుగుతున్న చర్చను పక్కన పెడితే.. అసలు రుచికరమైన లడ్డూలను ఎలా చేస్తారో చాలామందికి అస్సలు తెలీదు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే మంచి లడ్డూలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఈ లడ్డూను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


శనగపిండి -  1 కప్పు


పాలు -  పిండిని కలిపేందుకు


నూనె - డీప్ ఫ్రైకి సరిపడా


నెయ్యి - 2 టేబుల్ స్పూన్


జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు


ఎండుద్రాక్ష - 2 టేబుల్ స్పూన్లు


పంచదార - కప్పు


నీళ్లు - కప్పు


యాలకుల - 3


క్రిస్టల్ షుగర్ - ఒకటిన్నర్ టేబుల్ స్పూన్


పచ్చకర్పూరం - పావు టీస్పూన్ 


తయారీ విధానం


ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో శనగపిండి వేసి బాగా కలపాలి. అనంతరం దానిలో పాలు వేసుకోవాలి. పిండి మరీ గట్టిగా కాకుండా.. మరీ మెత్తగా కాకుండా దోశలు పోసుకునే రేంజ్​లో కొద్ది కొద్దిగా పాలు వేస్తూ కలుపుకోవాలి. సాధారణంగా లడ్డూలు తయారు చేసుకునేప్పుడు పిండిని కలుపుకోవడానికి నీళ్లు వేసి కలుపుకుంటారు. కానీ తిరుపతి లడ్డూ తయారు చేసుకునేప్పుడు పాలు వేసి చేసుకోవాలి. అప్పుడే దీనికి మంచి రుచి వస్తుంది. దీనిని ఓ 5 నిమిషాలు పక్కనపెట్టాలి.


ఇప్పుడు స్టౌవ్ వెలిగించి కడాయి పెట్టాలి. దానిలో డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత బూందీ గరిటెతో పిండిని వేసుకోవాలి. మంటను తగ్గించి.. బూందీని వేయించుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా బూందీ చేసుకోవాలి. ఇప్పుడు ఓ కప్పు బూందీని తీసుకోవాలి. దీనిని మిక్సీజార్​లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లడ్డూ చుట్టూకోవడం మరింత ఈజీ అవుతుంది. 



ఇప్పుడు స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోవాలి. వేడి అయిన తర్వాత దానిలో జీడిపప్పు వేయాలి. అవి కాస్త వేగిన తర్వాత ఎండుద్రాక్షలు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం కోసం మందపాటి కడాయిని తీసుకోవాలి. స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి ఉంచి పంచదార వేయాలి. అదే కొలతలో నీరు వేసి పంచదారను పూర్తిగా కరగనివ్వాలి. స్టౌవ్ సిమ్​లోనే ఉండాలి.


పంచదార కరిగిన తర్వాత మంటను మీడియం చేయాలి. పంచదార నీళ్ల పాకం కంటే కాస్త ముదరగానే స్టౌవ్ ఆపేయాలి. ఇప్పుడు దానిలో బూందీ.. బూందీ పౌడర్.. వేయించుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయాలి. యాలకుల పొడితో పాటు.. క్రిస్టల్ పంచదార, పచ్చకర్పూరం, నెయ్యి వేసి కలిపి పక్కన ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల పాకం అంతా బూందీలోకి ఇంకుతుంది. దీనిని ఓ 20 నిమిషాలు పక్కన పెట్టాలి. 



లడ్డూల్లో పచ్చకర్పూరం కచ్చితంగా వేసుకోవాలని గుర్తించుకోండి. అప్పుడే లడ్డూ టేస్ట్ వేరే లెవల్‌లో ఉంటుంది. 20 నిమిషాలకు పాకం అంతా బూందీలోకి చిక్కుకుంటుంది. ఇప్పుడు వాటిని లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ లడ్డూలు రెడీ. పండుగల సమయంలోనే కాకుండా నార్మల్​గా కూడా ఈ లడ్డూలు చేసుకుని స్వామికి నైవేద్యంగా పెట్టవచ్చు. 


Also Read : ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది