Jammu Kashmir bus accident: జమ్ము కశ్మీర్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఒక బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్ల మృత్యువాత పడ్డారు. మరో 32 మంది గాయపడగా.. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బుద్గాం జిల్లాలో బస్సు ప్రమాదం:
ఎలక్షన్ డ్యూటీ కోసం 35 మందితో వెళ్తున్న జవాన్ల బస్సు.. సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో బ్రెల్ వాటర్‌హెయిల్ ప్రాంతంలో రోడ్డు మీద నుంచి స్లిప్ అయి లోయలోకి జారిపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటలో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో 32 మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని బీఎస్‌ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. బీఎస్‌ఎఫ్ జవాన్లతో డ్రైవర్ కూడా గాయపడ్డాడు. వీళ్లని జమ్ము కశ్మీర్‌లో జరగనున్న సెకండ్ ఫేజ్ ఎలక్షన్ నిర్వహణలో సెక్యూరిటి కోసం ఈసీ తరలిస్తోంది.
జమ్ము కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత ఎన్నికలు:
జమ్ము కశ్మీర్‌లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల సంఘం వాటిని మూడు దశల్లో చేపడుతోంది. 2109లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు సహా జమ్ము కశ్మిర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎన్నికల సంఘం పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. బుధవారం నాటి తొలి దశలో ఈ యూనియన్ టెరిటరీలోని 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్ము కశ్మీర్‌ను యూనియన్ టెరిటరీగా మార్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కూడా ఇవే కావడం విశేషం. దీనిలో మొదటి దశ సెప్టెంబర్ 18న పూర్తి కాగా.. రెండో దశ ఈ సెప్టెంబర్ 25న నిర్వహించనుంది. అక్టోబర్ 1న మూడో దశ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు ముందు అక్టోబర్ 4నే వెల్లడించాలని ఎన్నికల సంఘం భావించినప్పటికీ ఆ తర్వాత అక్టోబర్ 8న వెల్లడి కానున్నట్లు తెలిపింది. తొలి దశ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ అవాంతరాలు ఏమీ ఏర్పడలేదు. మొత్తం 24 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించగా 61 శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. రెండో దశలో 26 స్థానాలకు, మూడో దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ , నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూటమిగా ఈ ఎన్నికలను ఎదుర్కొంటుండగా.. భారతీయ జనతా పార్టీ, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్‌తో పాటు మరి కొన్ని పార్టీలు ఏ పార్టీలతో కలవకుండా నేరుగా బరిలో నిలిచాయి.సెప్టెంబర్ 25న రాజౌరీ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున సెంట్రల్ ఆర్మ్‌డ్ పారామిలటరీ ఫోర్సెస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు చెందిన కంపెనీలు రాజౌరీకి చేరుకుంటున్నాయి.
పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యలతో విమర్శలు- ప్రతి విమర్శలతో వేడెక్కిన రెండో దశ ఎన్నికల ప్రచారం:
జమ్ము కశ్మీర్ విషయంలో తమ ఆలోచన భారత్‌లోని కాంగ్రెస్ ఆలోచన ఒకటేనంటూ పాకిస్తాన్ మంత్రి వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీపై భాజపా ఘాటు విమర్శలు ఎక్కుపెడుతోంది. పాకిస్తాన్- కాంగ్రెస్ ఒకే తాను ముక్కలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వస్తే తిరిగి జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి పునరుద్ధరిస్తామంటూ కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం మౌనం వహిస్తోంది.