LPG Cylinder Price Cut: 


కేంద్ర ప్రభుత్వం మంగళవారం గ్యాస్‌ సిలిండర్ల ధరను రూ.200 తగ్గించింది. ఉజ్వలా పథకం లబ్ధిదారులకు అదనంగా మరో రూ.200 రాయితీ అందిస్తోంది. ఈ ఆర్థిక ఏడాదిలో మిలిగిన ఏడు నెలలూ ప్రభుత్వం గ్యాస్‌ ధరలను పెంచబోదని సమాచారం. దాంతో వినియోగదారులు రూ.18,500 కోట్ల మేర ఆదా చేయబోతున్నారు. ధరలను తగ్గించినప్పటికీ ప్రభుత్వ ఫ్యుయెల్‌ రిటైలర్లు ఒక్కో రీఫిల్‌పై రూ.100కు పైగా లాభం పొందుతారని తెలిసింది. ఒకవేళ నష్టం వస్తే మోదీ సర్కారు భరించడానికి సిద్ధంగా ఉందట.


ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రూ.22,100 కోట్ల మేర లాభం ఆర్జించాయి. జనవరి-మార్చి త్రైమాసికం నాటి రూ.20,800 కోట్లతో పోలిస్తే ఇదెంతో ఎక్కువ. ఏడాది కిత్రంనాటి రూ.18,500 కోట్ల నష్టంతో పోలిస్తే అద్భుతమేనని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది.


మంచి కార్పొరేట్‌ పౌరుల మాదిరిగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ధరలను తగ్గించాయని పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ బుధవారం అన్నారు. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఆరోగ్యకరమైన లాభాలను ఆర్జించాయని వెల్లడించారు. రాబోయే నెలల ఆదాయం తమ నిర్ణయానికి మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే సబ్సిడీతో ప్రభుత్వం మద్దతుగా ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం ఇవ్వలేదు.


'ఆయిల్‌ కంపెనీలను ప్రోత్సహించేందుకు మంచి కార్పొరేట్‌ పౌరులుగా పేర్కొంటున్నాం. సంక్షోభ సమయాలు, అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పుడు స్వల్పకాల లాభాలను చూడొద్దు. ఎందుకంటే ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీల వ్యాపారాలు చాలా పెద్దవి' అని హర్దీప్‌ పూరీ అన్నారు.


ఏదేమైనా ప్రభుత్వం తగ్గించిన రూ.200తో 33 కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.32,000 కోట్లు మిగలనుంది. 2022-23లో రీఫిల్‌ చేసిన 160 కోట్ల సిలిండర్లను బట్టి దీనిని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఉజ్వలా స్కీమ్‌ కింద మరో 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు రాయితీ రూ.400కు చేరడంతో లబ్ధిదారులు మరిన్ని సిలిండర్లు కొనే అవకాశం ఉందని. ఉజ్వల వినియోగదారులు సగటున ఏడాది నాలుగు సిలిండర్లు ఉపయోగిస్తున్నారు. జనరల్‌ కేటగిరీ వినియోగదారులు ఎనిమిది వరకు వాడుతున్నారు.


'మిగిలిన ఏడాదిలో ధరలు ఎలా ఉంటాయో ఊహించడం ప్రభుత్వానికి ఇప్పుడే సాధ్యమవ్వదు. ఒకవేళ ఆయిల్‌ కంపెనీలు నష్టపోతున్నాయని తెలిస్తే వారికి పరిహారం అందిస్తాం' అని ఆయిల్‌ మినిస్ట్రీకి చెందిన ఓ అధికారి మీడియాకు తెలిపారు. 2022-23లో గృహ వినియోగ సిలిండర్ల ధరల పెంచకుండా ఉన్నందుకు ప్రభుత్వం రూ.20,000 గ్రాంటును ఒకేసారి విడుదల చేసింది.


ఆగస్టు నెలారంభంలో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సవరించాయి. 19 కిలోల ఎల్పీజీ బండపై రూ.99.75 తగ్గించింది. దాంతో దిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1680కి చేరుకుంది. అయితే 14.2 కిలోల గృహ అవసరాల సిలిండర్‌ ధరను మార్చి ఒకటి నుంచి తగ్గించలేదు. ప్రస్తుతం సబ్సిడీయేతర సిలిండర్‌ రూ.1100 నుంచి రూ.1120 వరకు ఉంటోంది. బహుశా సెప్టెంబర్‌ ఒకటి నుంచి డొమస్టిక్‌ సిలిండర్ల ధరలు తగ్గుతాయని అంచనా.


Also Read: FPO టైమ్‌లో హిండెన్‌బర్గ్‌ దాడి! సుప్రీం విచారణ టైమ్‌లో ఓసీసీఆర్పీ దాడి!