Adani Group:


ఊహించిందే జరిగింది! అదానీ గ్రూప్‌పై మరో విదేశీ సంస్థ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికలోని అంశాలనే తిరిగి ఉటంకించింది. అదానీ కుటుంబ భాగస్వాములే గుర్తు తెలియని ఫండ్ల రూపంలో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది. ఇవి భారత నియంత్రణ సంస్థల నిబంధనలకు విరుద్ధమని తెలిపింది.


బిలియనీర్‌ జార్జ్‌ సొరోస్‌, రాక్ ఫెల్లర్‌ బ్రదర్స్‌ ఫౌండేషన్లు నిధులు అందజేసిన 'ఆర్గనైజుడ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌' (OCCRP) గురువారం రాత్రి ఈ రిపోర్టును విడుదల చేసింది. కాగా ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ గట్టిగా తిప్పికొట్టింది.


'పాత ఆరోపణలనే మళ్లీ కొత్తగా చేస్తున్నారు. చూస్తుంటే ఇది జార్జ్‌ సొరోస్‌ నిధులు కేటాయించిన కంపెనీల మరో ప్రయత్నంగా అనిపిస్తోంది. ఏ మాత్రం మెరిట్‌ లేని హిండెన్‌బర్గ్‌ రిపోర్టును ప్రచురించిన విదేశీ మీడియాలోని ఓ వర్గమే వీరికి మద్దతుగా ఉంటోంది. గత వారమే మీడియాలో వార్తలు రావడంతో మేం దీనిని ముందుగానే ఊహించాం' అని అదానీ గ్రూప్‌ తెలిపింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌పీవోకు వచ్చే ముందే హిండెన్‌బర్గ్‌ తమ రిపోర్టును విడుదల చేసింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై సుప్రీం కోర్టులో విచారణకు ముందు ఓసీసీఆర్పీ అదే ఆరోపణలో కొత్త రిపోర్టు ప్రచురించింది. 'మాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. మా కార్పొరేట్‌ పాలనా ప్రమాణాలు, సెబీకి మేం సమర్పించిన రిపోర్టులపై విశ్వాసం ఉంది. నిజాలు బయట పడుతున్న తరుణంలో తప్పుడు, నిరాధార నివేదికలు రావడం అనుమానాస్పదంగా అనిపిస్తోంది. మేం వీటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం' అని అదానీ గ్రూప్‌ వివరణ ఇచ్చింది.


దశాబ్దం కిందటే మూసేసిన కేసుల ఆధారంగా మళ్లీ కొత్త ఆరోపణలు చేస్తున్నారని అదానీ గ్రూప్‌ తెలిపింది. ఇన్వాయిసింగ్‌, విదేశాలకు నిధుల బదిలీ, సంబంధిత పార్టీల లావాదేవీలు, ఎఫ్‌పీఐల నుంచి పెట్టుబడులపై వచ్చిన ఆరోపణలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) దర్యాప్తు జరిపి క్లీన్‌చిట్‌ ఇచ్చిందని అదానీ గ్రూప్‌ గుర్తు చేసింది.


'అధిక విలువ లేదని, లావాదేవీలన్నీ చట్ట ప్రకారమే ఉన్నాయని స్వతంత్ర న్యాయ విచారణ సంస్థ, అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఎప్పుడో ధ్రువీకరించాయి. 2023 మార్చిలో సుప్రీం కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఓవర్‌ వాల్యుయేషన్‌ లేదని స్పష్టత వచ్చింది. నిధులు బదిలీపై ప్రాథమిక ఆధారాలూ లేవు' అని అదానీ గ్రూప్‌ తెలిపింది. ఓసీసీఆర్పీ ఇచ్చిన రిపోర్టును గార్డియన్‌, ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ప్రచురించడం గమనార్హం.


'ఈ పబ్లికేషన్స్ మమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాయి. వాటికి మేం వివరణలు ఇచ్చాం. అయితే మా స్పందనను పూర్తిగా ప్రచురించకపోవడం దురదృష్టకరం. మా షేర్ల ధరలను తగ్గించి లాభాలు ఆర్జించాలనే ఇదంతా చేస్తున్నారు. ఈ షార్ట్‌ సెల్లర్స్‌పై ఇప్పటికే కొన్ని సంస్థలు దర్యాప్తు జరుపుతున్నాయి. సుప్రీం కోర్టు, సెబీ విచారణ నేపథ్యంలో ఆ ప్రక్రియను గౌరవించడం అందరి బాధ్యత' అని అదానీ గ్రూప్‌ తెలిపింది.


Also Read: OCCRP దెబ్బకు అదానీ స్టాక్స్‌ విలవిల - అదానీ గ్రూప్‌ ఇలా రియాక్ట్‌ అయింది