Opposition Meeting: 



ముంబయిలో రెండ్రోజుల భేటీ 


మోదీ సర్కార్‌ని ఢీకొట్టేందుకు దాదాపు 26 పార్టీలు ఒక్కటై I.N.D.I.A కూటమి ఏర్పాటు చేశాయి. ఇప్పటికే రెండు సార్లు భేటీ అయిన ఈ కూటమి...ఇప్పుడు ముంబయిలో సమావేశమవుతోంది. కూటమి ఏర్పాటైనప్పటికీ ఇంత వరకూ ఎవరు దీన్ని లీడ్ చేస్తారన్నది మాత్రం ప్రకటించలేదు. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఈ ముంబయి భేటీతో ఈ విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ భేటీకి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ముంబయిలో పలు చోట్ల హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ వద్ద కాషాయ జెండాలు ఏర్పాటు చేయించింది ఉద్దవ్ థాక్రే సేన. "హిందుత్వమే మా అజెండా. ఇండియాలో ఉండే వాళ్లందరూ హిందువులే" అని వాదిస్తోంది ఆ పార్టీ. ఇదే సమావేశంలో సీట్‌ షేరింగ్ విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ కమిటీలో ఎలాంటి విభేదాలు రాకుండా కో ఆర్డినేట్ చేసేందుకు ప్రత్యేకంగా ఓ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 11 మంది సభ్యులుంటారు. 










కన్వీనర్ ఎవరు..? 


ఈ మొత్తం కూటమికి ఓ కన్వీనర్‌నీ నియమించనున్నారు. ఈ పదవిపైనా ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. మొదటి నుంచి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు వినిపిస్తోంది. అయితే...ఆయన మాత్రం ఈ పదవిపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. తనకు ఏ పదవీ వద్దని తేల్చి చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కూటమికి ఎవరు కన్వీనర్‌గా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠగా మారింది. ఈ రెండు రోజుల్లోనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కన్వీనర్ పేరుని ప్రకటించనున్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నదానిపైనా ఇంకా క్లారిటీ రాలేదు. AAP, JDU, SP పార్టీలు మాత్రం తమ పార్టీ నుంచే ప్రధాని అభ్యర్థి ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి. I.N.D.I.A కూటమిలో మరి కొన్ని పార్టీలు చేరే అవకాశముందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వెల్లడించారు. అయితే ఆ పార్టీల పేర్లను మాత్రం ప్రస్తావించలేదు.