LPG Connection through WhatsApp: కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ కోసం గ్యాస్‌ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక స్మార్ట్‌ ఫోన్‌, అందులో వాట్సాప్‌ ఉంటే చాలు.. ఇంట్లో కూర్చునే ఈజీగా కొత్త కనెక్షన్‌ బుక్‌ చేయవచ్చు.


మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (OMCలు) కూడా అప్‌గ్రేడ్‌ అవుతున్నాయి, కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నాయి. ఈ ఫీచర్లలో ఒకటి వాట్సాప్‌ ద్వారా కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవడం. ఇప్పుడు, ప్రతి గ్యాస్‌ కంపెనీ వాట్సాప్‌ సర్వీసును అందిస్తోంది. మీకు కొత్త కనెక్షన్‌ కావాలంటే, మీరు కోరుకున్న కంపెనీకి వాట్సాప్‌లో 'హాయ్‌' (Hi) చెబితే చాలు. తర్వాతి ప్రాసెస్‌ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరిగిపోతుంది, మీ ఇంటికి కనెక్షన్ వస్తుంది.  


వాట్సాప్‌ ద్వారా కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ ఎలా తీసుకోవాలి?
ఉదాహరణకు... మీకు ఇండేన్‌ గ్యాస్‌ కనెక్షన్‌ కావాలంటే.. ఆ కంపెనీ వాట్సాప్‌ నంబర్‌ 75888 88824 కు 'హాయ్‌' (Hi) అని మెసేజ్‌ పంపాలి. వెంటనే మీకు రిప్లై వస్తుంది. అందులో, కొత్త కనెక్షన్‌ తీసుకోవడం దగ్గర నుంచి గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేయడం (Booking LPG cylinder through WhatsApp) వరకు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ ఆప్షన్లకు ఎదురుగా సీరియల్‌ నంబర్లు ఉంటాయి. మీకు కావలసిన సర్వీస్‌ ఎదురుగా ఉన్న సీరియల్‌ నంబర్‌ను రిప్లై రూపంలో పంపాలి. ‘సువిధ’ ఆప్షన్‌ ద్వారా కొత్త కనెక్షన్‌ తీసుకోవడం, కనెక్షన్‌ రద్దు చేసుకోవడం వంటి సర్వీసులను పొందవచ్చు.


మీకు HP గ్యాస్‌ కనెక్షన్‌ కావాలన్నా, ఇతర సర్వీసులను అందుకోవాలన్నా ఆ కంపెనీ వాట్సాప్‌ నంబరు 92222 01122కు హాయ్‌ చెప్పండి. అలాగే, భారత్‌ గ్యాస్‌ వాట్సాప్‌ నంబర్‌ 18002 24344.


కస్టమర్ల కోసం వాట్సాప్‌ సర్వీస్‌ తీసుకొచ్చినా, దానికి తగిన ప్రచారం జరగలేదు, ఎక్కువ మందికి చేరలేదు. దీంతో, వాట్సాప్‌ ద్వారా గ్యాస్‌ బుక్‌ చేసుకుంటున్న కస్టమర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 42 లక్షలు పైగా గ్యాస్‌ కనెక్షన్లు ఉంటే, దాదాపు ముప్పావు వంతు మంది (75 శాతం మంది కస్టమర్లు) ఏజెన్సీలకు ఫోన్‌ చేసి సిలిండర్‌ బుక్‌ చేసుకుంటున్నారు. UPI డిజిటల్‌ వ్యాలెట్‌ ద్వారా 15 శాతం మంది; కంపెనీ వెబ్‌సైట్‌, ఇతర మార్గాల ద్వారా మిగిలిన 10 శాతం మంది సిలిండర్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఇతర సర్వీసులను పొందడానికి కూడా ఇవే రూట్స్‌ ఇదే ఫాలో అవుతున్నారు.


వాట్సాప్‌ ద్వారా LPG సిలిండర్‌ ఎలా బుక్‌ చేయాలి?
మీరు ఇండేన్ కస్టమర్ అయితే, మీ LPG సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి కొత్త నంబర్ 77189 55555కి కాల్ చేయవచ్చు. వాట్సాప్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌ మెసెంజర్‌లో, "REFILL" అని టైప్ చేసి, దానిని 75888 88824 నంబర్‌కు పంపండి. కంపెనీలో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే మెసేజ్‌ పంపాలని గుర్తు పెట్టుకోండి. 


ఒకవేళ మీరు HP కస్టమర్ అయితే, గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయడానికి, మీ వాట్సాప్‌ మెసెంజర్‌లో "BOOK" అని టైప్ చేసి 92222 01122 నంబర్‌కు మెసేజ్‌ పంపాలి. సిలిండర్‌ బుక్ చేయగానే, డెలివెరీ చేయడానికి మిమ్మల్ని టైమ్‌ అడుగుతారు, మీకు అనుకూలమైన టైమ్‌ను సెట్‌ చేసుకోవచ్చు.  మీ LPG కోటా, LPG ID, LPG సబ్సిడీ సహా ఇతర సర్వీసుల గురించి తెలుసుకోవడానికి కూడా ఈ నంబర్‌ను ఉపయోగించవచ్చు. రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్ నుంచి మాత్రమే కంపెనీకి మెసేజ్‌లు పంపాల్సి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: పసిడి రేటు స్థిరం - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial