TV Subscription Rates 2024: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో చాలా కాలంగా కొన్ని వస్తువులు, సేవల ధరలు పెరగలేదు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయ్యాయి, ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ ఏదో తేలిపోయింది. ఇన్నాళ్లు ఉగ్గబట్టి ఉన్న కంపెనీలు ధరలు పెంచడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. అతి త్వరలోనే చాలా వస్తువులు & సేవల రేట్లు సర్రున పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇంటి బడ్జెట్‌ను సర్దుకోవడానికో, పెంచుకోవడానికో సామాన్యులు కూడా సిద్ధంగా ఉండాలి.


రేట్లు పెరిగే లిస్ట్‌లో టీవీ ఛానెల్‌ సబ్‌స్క్రిప్షన్లు ఉన్నాయి. ఈ ధరలు పెరిగితే, టీవీ చూడటానికి మీ జేబు నుంచి మరింత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి ఉంటుంది. వాస్తవానికి, మన దేశంలోని పాపులర్‌ ఛానెళ్లు డిస్నీ స్టార్ (Disney Star), వయాకామ్ 18 (Viacom18), జీ ఎంటర్‌టైన్‌మెంట్ (Zee Entertainment), సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్‌ (Sony Pictures Networks) తమ సబ్‌స్క్రిప్షన్‌ రేట్లను ఈ ఏడాది జనవరిలోనే పెంచాయి. అయితే, కొత్త రేట్లు ఇప్పటికీ అమల్లోకి రాలేదు. మార్కెట్‌ అంచనాల ప్రకారం.. టీవీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు 5 శాతం నుంచి 25 శాతం మేర పెరిగాయి.


లోక్‌సభ ఎన్నికల వరకు ఆగాలని ట్రాయ్ ఆదేశం
సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెంచిన టీవీ ఛానెళ్లు... రేట్ల పెంపు ఒప్పందాలపై సంతకం చేయాలని అన్ని బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు 'డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫామ్ ఆపరేటర్స్‌'ను (DPOs) కోరాయి. అయితే, లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election 2024) ముగిసే వరకు ఆగాలని అన్ని బ్రాడ్‌కాస్టర్లను 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI లేదా ట్రాయ్) ఆదేశించింది. కొత్త ఒప్పందాలపై సంతకం చేయకపోయినా DPOలకు పంపే సిగ్నళ్లను స్విచ్‌ ఆఫ్‌ చేయవద్దని కూడా సూచించింది. ఇప్పుడు, లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఆ ఒప్పందాలపై సంతకాలను TRAI ఏ క్షణమైనా ఆమోదించవచ్చు, ఛానెళ్ల రేట్లు ఎప్పుడైనా పెరగొచ్చు.


ఈ ఏడాది జనవరిలో, అన్ని పెద్ద బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీలు తమ ఛానెల్‌ బొకే రేట్లను సగటున 10 శాతం వరకు పెంచాయి. వయాకామ్ 18 తన రేట్లను గరిష్టంగా 25 శాతం హైక్‌ చేసింది. పెద్ద క్రికెట్ టోర్నమెంట్‌ల ప్రసార హక్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్ల మార్కెట్ వాటా పెరగడం వల్ల ఈ అడ్వాంటేజ్‌ తీసుకుంది. కొత్త రేట్లు ఫిబ్రవరి నుంచి అమల్లోకి రావలసి ఉంది. జూన్ 01న లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ పూర్తయింది. జూన్ 04న ఎన్నికల ఫలితాలు కూడా వచ్చాయి. రేట్ల పెంపునకు అడ్డంకులు తొలగిపోయాయన నేపథ్యంలో, అన్ని బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీలు రేట్లు పెంచడానికి DPOలపై ఒత్తిడి తెస్తాయి. ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ ఇప్పటికే రేట్లను పెంచింది. మిగిలిన DPOలు కూడా పెరిగిన రేట్ల భారాన్ని అతి త్వరలోనే ప్రజల నెత్తిన రుద్దే అవకాశం ఉంది.


ఎన్నికలు ముగిసిన రోజు నుంచే ధరల పెంపు
జూన్‌ 01న, చివరి విడత పోలింగ్‌ ముగిసిన వెంటనే ధరల పెంపు ప్రారంభమైంది. తొలుత, టోల్ ఛార్జీలు ‍‌(Toll Tax) 5 శాతం వరకు పెరిగాయి. దేశంలో రెండు అతి పెద్ద పాల ఉత్పత్తి కంపెనీలు అముల్‌ ‍‌(Amul Milk Price), మదర్ డెయిరీ (Mother Dairy Milk Price) పాల రేటును లీటరుకు రూ. 2 పెంచాయి. కొన్ని రాష్ట్రాల్లో RTC చార్జీలు పెరిగాయి. పెట్రోల్‌ & డీజిల్‌ రేట్లు త్వరలో పెరిగే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. టెలికాం కంపెనీలు రిలయన్స్‌ జియో ‍‌(Reliance Jio), భారతి ఎయిర్‌టెల్‌ (Bharati Airtel) తమ టారిఫ్‌లు పెంచే యోచనలో ఉన్నాయని సమాచారం. కొన్ని నెలల క్రితమే టారిఫ్స్‌ పెంచాల్సివున్నా, లోక్‌సభ ఎన్నికల కారణంగా ఆగిపోయాయి. ఇప్పుడు, మొబైల్‌ ప్లాన్‌ రేట్లు 15 శాతం నుంచి 17 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. 


మరో ఆసక్తికర కథనం: ఐటీ రిటర్న్‌లో ఈ పేపర్లు లేకపోతే HRA మినహాయింపు రిజెక్ట్‌ కావచ్చు!