Gaza News: ఇజ్రాయేల్ హమాస్ యుద్ధంతో చాలా మంది పౌరులు బలి అవుతున్నారు. రఫాపై చేస్తున్న దాడుల వల్లా భారీ ప్రాణనష్టం వాటిల్లుతోంది. చిన్నారులు ఆకలితో అలమటిస్తున్నారు. మరి కొంత మంది వైద్య సాయం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పుడు మరోసారి గాజాలో బాంబుల మోత మోగింది. స్కూల్‌పై జరిగిన దాడిలో 27 మంది చనిపోయారు. Reuters ఈ విషయం వెల్లడించింది. యుద్ధం కారణంగా ఆశ్రయం కోల్పోయి స్కూల్‌లో తలదాచుకుటుంన్న వాళ్లంతా ఈ దాడిలో బలి అయ్యారు. సెంట్రల్ గాజాలోని నుసీరట్‌లో యునైటెడ్ నేషనల్ స్కూల్‌లో హమాస్ ఉగ్రవాదుల బేస్ ఉందని, అందుకే దాడి చేశామని ఇజ్రాయేల్ చెబుతోంది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయేల్‌పై దాడి చేసిన ఉగ్రవాదులు ఇక్కడే ఉన్నారని వాదిస్తోంది. దాడి చేసే ముందే పౌరుల ప్రాణాలకు ఎలాంటి హాని రాకుండా జాగ్రత్త పడ్డామని, ప్రాణననష్టం తగ్గించేందుకే ప్రయత్నించామని వివరించింది. అటు హమాస్ మాత్రం ఇదంతా బూటకం అని కొట్టి పారేస్తోంది. కావాలనే దాడి చేసినట్టు ఆరోపిస్తోంది. కట్టుకథలు చెప్పి ఇజ్రాయేల్ తప్పించుకోవాలని చూస్తోందని మండి పడింది. ఓ వైపు శాంతియుత చర్చలు జరుగుతుండగానే ఇటు దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయేల్, హమాస్ మధ్య ఎక్కడా సయోధ్య కుదరడం లేదు. ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి.