Write-Off Loan Recovery: అదేంటో.. డబ్బుల్లేక ఒక సామాన్య వ్యక్తి రుణం చెల్లించలేకపోతే అతని కుటుంబాన్ని వీధిలోకి గెంటేసి ఇంటిని స్వాధీనం చేసుకునే బ్యాంకులు, ఇనప్పెట్టె నిండా డబ్బుండీ అప్పు కట్టని ఒక బడా బాబుకు మాత్రం రాచమర్యాదలు చేస్తాయి, అతని రుణాన్ని మాఫీ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంటాయి. ఇవి ఊహలు కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు.


గత నాలుగు సంవత్సరాల్లో బ్యాంకులు రూ. 8.48 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశాయట. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అధికారిక గణాంకాలు ఇవి.


₹2 లక్షల కోట్ల రుణాల రికవరీ
ప్రభుత్వ బ్యాంకులు మాఫీ చేసిన రుణాల రికవరీ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఐదేళ్లలో, మాఫీ చేసిన రుణాల్లో రూ. 2.03 లక్షల కోట్లను తిరిగి వసూలు చేయగలిగామని ఆర్థిక శాఖ వెల్లడించింది. SARFAESI చట్టం, డెట్ రికవరీ ఆర్బిట్రేషన్ ద్వారా మొండి బకాయిలను రికవరీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత నాలుగేళ్లలో బ్యాంకులు 8 లక్షల 48 వేల కోట్ల రూపాయల (రూ. 8,48,182 కోట్లు) రుణాలను మాఫీ చేశాయని ప్రభుత్వం తెలిపింది.


గత ఐదేళ్లలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని ఎగవేతదార్ల (డిఫాల్టర్లు) ఆస్తులను విక్రయించడం ద్వారా ఎంత డబ్బు రికవరీ అయ్యిందని రాజ్యసభ సభ్యుడు ఆర్థిక శాఖను ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రుణ రికవరీ ఆర్బిట్రేషన్ ద్వారా, SARFAESI చట్టం- 2002 (సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్), RDB చట్టం-1993 ‍‌(రికవరీ ఆఫ్‌ డెట్స్‌ అండ్‌ బ్యాంకరప్ట్సీ యాక్ట్‌) ప్రకారం రుణాల రికవరీ జరుగుతోంది. ఈ చట్టాల ప్రకారం, రుణ ఎగవేతదార్ల ఆస్తులను విక్రయించడం ద్వారా రుణాన్ని రికవరీ చేస్తారు.


SARFAESI యాక్ట్‌ అంటే?
కోర్టు జోక్యం లేకుండానే మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులను (NPAలు) తిరిగి పొందేందుకు బ్యాంకులకు అధికారం కల్పించే ఉద్దేశ్యంతో రూపొందించినదే SARFAESI చట్టం. భారతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కోర్టుల నుంచి ఎటువంటి అనుమతి అవసరం లేకుండా, కేవలం ఒక్క నోటీసుతో క్రెడిట్ డిఫాల్టర్ల ఆస్తులును విక్రయించడానికి లేదా వేలం వేయడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమాచారం ప్రకారం... 2017-18 నుంచి 2021-22 వరకు, ఈ ఐదేళ్లలో SARFACI చట్టం ద్వారా రూ. 1,54,603 కోట్లను బ్యాంకులు రికవరీ చేశాయి. డెట్ రికవరీ ఆర్బిట్రేషన్ ద్వారా మరో రూ. 48,287 కోట్లను రికవరీ చేశాయి. ఈ మొత్తం కలిపి, రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలను తిరిగి వసూలు చేశాయి. ఈ రుణాలను బ్యాంకులు గతంలో మాఫీ చేశాయి.


నాలుగు సంవత్సరాల పాటు NPAలు ఉన్న తర్వాత, ఈ రుణాలకు బదులుగా ప్రొవిజన్స్‌ (Provisions) చేయడం ద్వారా వాటిని మాఫీ చేస్తారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ తెలిపారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బోర్డు ఆమోదం ద్వారా NPAలను రద్దు చేస్తారని తెలిపారు. 


నాలుగేళ్లలో ₹8.5 లక్షల కోట్ల రుణమాఫీ
రిజర్వ్ బ్యాంక్ డేటా ప్రకారం... షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు 2018-19లో రూ. 2,36,265 కోట్లు, 2019-20లో రూ. 2,34,170 కోట్లు, 2020-21లో రూ. 2,02,781 కోట్లు, 2021-22లో రూ. 1,74,966 కోట్ల రుణాలు మాఫీ చేశాయి.


రుణం మాఫీ చేసినా రుణగ్రహీత నుంచి రుణ రికవరీకి ప్రయత్నాలు జరుగుతాయి. రైట్ ఆఫ్ లోన్ (Write-Off Loan) ఖాతా నుంచి రుణ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రుణమాఫీ చేయడం ద్వారా రుణగ్రహీతకు ఎలాంటి ఉపశమనం లభించదని, చట్టం ప్రకారం రుణ రికవరీ కొనసాగుతుందని భగవత్ కరద్ వెల్లడించారు.