Liquor Sales In India In FY23: భారతదేశంలో మందుబాబులు మహా జోరుగా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), మందు తాగడంలో మన వాళ్లు కొత్త రికార్డ్ సృష్టించారు. 'కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్' (CIABC) ఈమధ్య రిలీజ్ చేసిన రిపోర్ట్‌లో ఈ లెక్కలు బయటికొచ్చాయి.
గత సంవత్సరం అమ్మకాలివి
CIABC డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశంలో తయారు చేసిన విదేశీ మద్యం (IMFL) అమ్మకాల సైజ్ 385 మిలియన్ కేసులకు చేరింది, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో (2021-22) పోలిస్తే 14 శాతం పెరిగింది. ఒక కేస్‌లో 9 లీటర్ల మందు ఉంటుంది. దీని ప్రకారం లెక్కేస్తే, FY23లో భారతీయులు దాదాపు 350 కోట్ల లీటర్ల ఆల్కహాల్ కొన్నారు, ఛీర్స్ కొట్టారు. ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగిన సేల్స్‌లో ఇదే రికార్డ్. కోవిడ్ మహమ్మారి కంటే ముందు, 2019-20 ఆర్థిక సంవత్సరం కన్నా ఈ నంబర్ 12 శాతం ఎక్కువ.
పెరుగుతున్న ప్రీమియం లిక్కర్ విక్రయాలు
గత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం కేటగిరీలో హైయెస్ట్ సేల్స్ జరిగినట్లు CIABC డేటా చెబుతోంది. 750 ml కు రూ. 1000 కంటే ఎక్కువ ఖరీదైన మద్యం ప్రీమియం కేటగిరీలోకి వస్తుంది. డేటా ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో, ప్రీమియం సెగ్మెంట్ అమ్మకాలు 48 శాతం పెరిగాయి. 750 ml కు రూ. 500-1000 రేటు పలికే కేటగిరీ వాటా 20 శాతానికి తగ్గింది. షేర్ పరంగా చూస్తే చీప్ లిక్కర్ టాప్ పొజిషన్‌లో ఉంది. మొత్తం అమ్మకాల్లో దాని వాటా దాదాపు 79 శాతం.
ఈ ఏడాది కూడా కిక్కు కొనసాగవచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) కూడా ఆల్కహాల్ సేల్స్‌లో జోరు కొనసాగవచ్చన్నది CIABC అభిప్రాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల్లో 8 శాతం వృద్ధిని CIABC అంచనా వేసింది. ఈ లెక్కన చూస్తే, 2023-24లో మొత్తం మద్యం అమ్మకాల సైజ్ దాదాపు 42 కోట్ల కేసులకు చేరుకుంటుంది. అంటే దాదాపు 380 కోట్ల లీటర్లను మందుబాబులు తమ పొట్టల్లో పోసుకునే అవకాశం ఉంది.
మన దేశంలో ఎక్కువగా సేల్ అవుతున్న ఆల్కహాల్ విస్కీ అని రిపోర్ట్ తేల్చింది. మొత్తం మద్యం విక్రయాల్లో దీని వాటా 63 శాతం. కొన్ని సంవత్సరాలు తగ్గుతూ వస్తున్న జిన్ వాటా, గత ఆర్థిక సంవత్సరంలో పెరిగింది.
దక్షిణాది రాష్ట్రాల దాహం తీరనిది
ప్రాంతాల గురించి చెప్పుకుంటే, గత ఆర్థిక సంవత్సరంలో పశ్చిమ రాష్ట్రాలు అత్యధికంగా 32 శాతం అమ్మకాలు సాధించాయి. తూర్పు రాష్ట్రాల్లో 22 శాతం, ఉత్తరాది రాష్ట్రాల్లో 16 శాతం, దక్షిణాది రాష్ట్రాల్లో 9 శాతం పెరుగుదల నమోదైంది. అయినా, మొత్తం అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ ఇప్పటికీ హై పిచ్‌లో ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం విక్రయాల్లో 58 శాతం వాటా దక్షిణాది వాళ్లదే. పశ్చిమ & తూర్పు రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ 22 చొప్పున ఉండగా, ఉత్తరాది రాష్ట్రాలు 16 శాతం వాటా అందించాయి.
గత ఆర్థిక సంవత్సరంలో, అమ్మకాల్లో 54 శాతం వృద్ధిని సాధించిన పంజాబ్, అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది.
మరో ఆసక్తికర కథనం: నిఫ్టీ 19,000 మార్క్‌ను చేరడం వెనుక విదేశీ హస్తం!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial