Linda Yaccarino Twitter New CEO: సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌కు కొత్త CEOని కనుగొన్నట్లు ప్రస్తుత CEO ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. మరో 6 వారాల్లో ఆమె పని ప్రారంభిస్తారంటూ గురువారం ట్వీట్‌ చేశారు. అయితే, ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే, NBC యూనివర్సల్ (NBC Universal) ఎగ్జిక్యూటివ్ లిండా యాకారినో ‍‌(Linda Yaccarino) ట్విట్టర్ తదుపరి CEO కావడానికి సిద్ధంగా ఉన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్‌ చేసింది.


44 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసి 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొన్న ఎలాన్‌ మస్క్‌, అప్పటి నుంచి ఆ కంపెనీ CEOగా కొనసాగుతున్నారు. కానీ, తాను శాశ్వత CEO కాదని, ఆ సీట్లో తాను ఎక్కువ కాలం ఉండనని గతంలోనే ప్రకటించిన మస్క్‌, తన వారసుడి కోసం తెగ అన్వేషించారు. ఎలాన్ మస్క్ తాజా ప్రకటనను బట్టి చూస్తే, CEO కోసం సాగిన అన్వేషణ ముగిసినట్లుగా అర్ధం అవుతోంది. 


"ట్విట్టర్‌కి కొత్త CEOని తీసుకున్నట్లు ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. ఆమె బాధ్యతలు 6 వారాల్లో ప్రారంభమవుతాయి" అని ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కొత్త సీఈవో వచ్చిన తర్వాత తన పాత్ర ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా (CTO) మారుతుందని, ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్, విభాగాల బాధ్యతలను తాను చూసుకుంటానని అదే ట్వీట్‌లో మస్క్‌ పేర్కొన్నారు.






లిండా యాకారినో ఎవరు? 
లిండా యాకారినో 2011 నవంబర్‌ నుంచి NBC యూనివర్సల్‌లో పని చేస్తున్నారు. తొలుత, కేబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ & డిజిటల్ అడ్వర్టైజింగ్ సేల్స్ ప్రెసిడెంట్‌గా NBC యూనివర్సల్‌లో చేరారు. ఒక సంవత్సరం తర్వాత, అడ్వర్టైజింగ్ & క్లయింట్ పార్ట్‌నర్‌షిప్‌ల ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. వ్యక్తిగత నెట్‌వర్క్ బృందాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా ఆ పదవిని సమర్థవంతంగా నిర్వహించారు. తద్వారా, కంపెనీకి ఏటా $10 బిలియన్లకు పైగా ఆదాయం వచ్చేలా చేశారు. 2020 అక్టోబర్‌లో, NBC యూనివర్సల్‌లో గ్లోబల్ అడ్వర్టైజింగ్ & పార్ట్‌నర్‌షిప్‌ల ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు.


NBC Universalలో చేరడానికి ముందు, 19 సంవత్సరాల పాటు టర్నర్ ఎంటర్‌టైన్‌మెంట్ అడ్వర్టైజింగ్ సేల్స్ & మార్కెటింగ్ అండ్ అక్విజిషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & COOగా యాకారినో పని చేశారు. యాకారినో ప్రతిభకు అనేక గౌరవాలు, పురస్కారాలు దక్కాయి. ఆమె పెన్ స్టేట్ యూనివర్శిటీలో టెలికమ్యూనికేషన్స్ చదివారు.


ట్విటర్‌ సీఈవో కావాలన్న ఆశ
బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్స్ ప్రకారం, ఎలాన్‌ మస్క్‌కు లిండా యాకారినో స్నేహితురాలు. తాను ట్విట్టర్ CEO కావాలనుకుంటున్నట్లు స్నేహితుడిని ఆమె అడిగినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్‌ చేసింది. ఎలోన్ మస్క్ విధానాలను యాకారినో చాలాసార్లు ప్రశంసించారు, అతనికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో, ట్విట్టర్‌ తదుపరి సీఈవోగా లిండా యాకారినోను మస్క్‌ నియమిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.