Insurance News: తొలి వేవ్‌లో కొవిడ్‌ సృష్టించిన విలయాన్ని చూసిన తర్వాత, జీవిత బీమా & ఆరోగ్య బీమా విషయాల్లో ప్రజల ఆలోచనల్లో బాగా మార్పులు వచ్చాయి. అవి ఎంత అవసరమో కోట్లాది భారతీయులకు అర్ధమైంది. దీంతో, 2021 , 2022 సంవత్సరాల్లో బీమా పథకాలు/ ఉత్పత్తుల కొనుగోళ్లు కొన్ని రెట్లు పెరిగాయి. ఇన్సూరెన్స్‌ కంపెనీలు సంపాదించే ప్రీమియంలూ వృద్ధి చెందాయి. బీమా కంపెనీల మధ్య పోటీ పెరిగి, గతం కంటే విభిన్నమైన, సమగ్ర పాలసీలు మార్కెట్‌లోకి వచ్చాయి. పాలసీ కొనుగోలు నుంచి క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ వరకు చాలా అంశాలను కస్టమర్‌కు అందుబాటు సమయంలోను, వర్చువల్‌ మార్గంలోనూ అందిస్తున్నాయి. 2022లో, బీమా రంగంలో వచ్చిన కీలక మార్పులు ఇవి:


కొత్త ఉత్పత్తులు


గత రెండేళ్లలో, దేశ ప్రజలకు ఆరోగ్య సంరక్షణ మీద శ్రద్ధ పెరగడంతో, పాలసీ కోసం చేసే వ్యయంతో పాటు క్లెయిమ్స్‌ సంఖ్య కూడా బాగా పెరిగింది. 2022లో ఆరోగ్య బీమా ప్రీమియంలు 8-15% మేర పెరిగాయి. 


గతంలో లేని విధంగా, చాలా బీమా సంస్థలు డాక్టర్‌ కన్సల్టేషన్‌, మందుల బిల్లులు సహా ఔట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (OPD) ఖర్చులను కవర్‌ చేసే పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. రూ. 5 కోట్ల రేంజ్‌ వరకు వివిధ కవరేజీలు, విదేశాల్లోనూ వైద్య చికిత్సను కవర్‌ చేస్తున్ాయి. ముఖ్యంగా వృద్ధుల విషయంలో, గతంలో ఉన్న వ్యాధులకు కూడా కవరేజీని అందించేలా వాల్యు-యాడెడ్‌ సేవలతో కొత్త పాలసీలను అందిస్తున్నాయి.


ఈ ఏడాది మోటార్‌ బీమాలో ‘పే-యాజ్‌-యూ-యూజ్‌’, ‘పే-యాజ్‌-యూ-డ్రైవ్‌’ వంటి వాహన వాడకం (తిరిగిన కిలోమీటర్లు ఇక్కడ లెక్క) ఆధారిత మోటార్ ఇన్సూరెన్స్‌ పాలసీలను బీమా సంస్థలు పరిచయం చేశాయి. కారు ప్రయాణించిన దూరం/ కిలోమీటర్ల ఆధారంగా ఈ బీమా ఉత్పత్తుల్లో ప్రీమియం చెల్లించవచ్చు. వీటితో, వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. చాలా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ఈ ఏడాది ఈ రైడర్స్‌ (Motor insurance riders) లేదా వాల్యూ యాడెస్‌ ప్రొడక్ట్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.


టర్మ్‌ ప్లాన్‌లో ఇవ్వజూపే మొత్తం భారీగా ఉంటున్నా, ఒకవేళ పాలసీదారు క్షేమంగా ఉంటే ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. ఈ కారణం వల్లే ఎక్కువ మంది టర్మ్‌ ప్లాన్లను పట్టించుకోవడం లేదు. దీన్లోనూ మార్పులను బీమా సంస్థలు ప్రవేశపెట్టాయి. పాలసీ కాల పరిమితి ముగియక ముందే ఎగ్జిట్‌ అయ్యి, అప్పటివరకు చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కు తీసుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. అంటే, దాదాపు సున్నా పెట్టుబడితో టర్మ్‌ ప్లాన్‌ కవరేజీని పొందవచ్చు. 45 ఏళ్ల లోపు వారికి, లాంగ్‌ టర్మ్‌ మెచ్యూరిటీ పిరియడ్‌కు పాలసీ తీసుకునే వారికి ఎగ్జిట్‌ అవకాశం ఇస్తున్నాయి. 


కీలక సంస్కరణలు


ఈ సంవత్సరం బీమా రంగంలో అతి పెద్ద సంస్కరణ వచ్చింది. సాధారణంగా, బీమా సంస్థలు ఒక పాలసీ రూపొందించి, దానిని మార్కెట్‌లోకి విడుదల చేయాలంటే.. ముందుగా బీమా నియంత్రణ సంస్థ ‍‌(Insurance Regulatory and Development Authority) అనుమతి పొందాలి. ఆ పాలసీ అన్ని నిబంధనలకు లోబడి ఉందని రెగ్యులేటరీ నిర్ధరించుకున్న తర్వాతే, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీమా సంస్థకు అనుమతి వస్తుంది. దీనిని ఫైల్‌ అండ్‌ యూజ్‌ (File-and-Use) అంటారు. 2022లో, యూజ్‌ అండ్‌ ఫైల్‌ (Use-and-File) పద్ధతిని రెగ్యులేటరీ తీసుకొచ్చింది. అంటే... బీమా సంస్థలు తమ కొత్త పథకాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసిన తర్వాత, అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీమా కంపెనీలకు అది చాలా పెద్ద ఉపశమనం. సకాలంలో తమ ఉత్పత్తిని మార్కెట్‌లోకి తీసుకెళ్లడానికి, పోటీ సంస్థల కంటే ముందుగానే కొత్త పథకాన్ని ప్రజలకు పరిచయం చేయడానికి దీని వల్ల వీలయింది.


జీవిత, జీవితేతర (జనరల్‌, మోటార్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వంటివి) పాలసీలను ఆఫర్‌ చేసే అన్ని కంపెనీలను సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు ‘బీమా సుగమ్‌’ (Bima Sugam) పేరుతో ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ను ప్రారంభించింది.  ఈ ఆన్‌లైన్‌ ఫ్లాట్‌పాం ద్వారా.... జీవిత, ఆరోగ్య, మోటారు బీమా పాలసీలను వివిధ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేయవచ్చు. మధ్యవర్తులు అందించే సేవలను కూడా పొందవచ్చు. ఈ వేదిక ద్వారా వివిధ పాలసీ ధరలను, కవరేజ్‌లను పోల్చి చూసి, ఉత్తమమైనది ఎంచుకునే వెసులుబాటు పాలసీదారుకు లభిస్తుంది. పోర్టబిలిటీ, ఆన్‌లైన్‌ యాక్సెస్‌, రెన్యువల్స్‌ కూడా చేసుకోవచ్చు. ఒక్క రూపాయి కూడా కమీషన్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. 


2023, జనవరి 1 నుంచి కొత్త పాలసీల కొనుగోళ్లు, పాత పాలసీల (జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా వంటివి అన్నీ) రెన్యువల్స్‌ అన్నింటికీ KYC తప్పనిసరి చేశారు. 2022లో, ఆరోగ్య బీమాల్లో ఒక లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్లెయిం వాల్యూ ఉంటేనే KYC డాక్యుమెంట్స్‌ సమర్పిస్తున్నారు. అంతేకాదు, 2022లో, ఎంత విలువ ఉన్నా జీవితేతర లేదా సాధారణ బీమా పాలసీలను తీసుకోవడానికి ఈ డాక్యుమెంట్స్‌ తప్పనిసరి కాదు. అయితే, 2023 నుంచి అన్ని రకాల పాలసీలకు KYC పత్రాలు సమర్పించాలి. అది కూడా క్లెయిం చేసే సమయంలో కాకుండా, పాలసీని కొనుగోలు చేసే సమయంలోనే ఇవ్వాలి.