Reliance Jio Network Down: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో ఈ రోజు (మంగళవారం, 17 సెప్టెంబర్ 2024) సమస్యలు ఎదురయ్యాయి. దేశవ్యాప్తంగా జియో సిగ్నల్స్ రాలేదు. ముఖ్యంగా... జియో మొబైల్ ఇంటర్నెట్, జియో ఎయిర్ ఫైబర్ మీద ఆధారపడి 'వర్క్ ఫ్రమ్ హోమ్' వంటి ఉద్యోగాలు చేసుకుంటున్నవాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. జియో నెట్‌వర్క్‌తో ట్రేడింగ్, బిజినెస్ చేస్తున్నవాళ్లు నష్టపోయారు.
జియో సిమ్ ఉపయోగిస్తున్న వినియోగదార్లు టెలికాం సేవలను ఉపయోగించుకోవడంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు. వేలమంది ఫోన్‌లు కలవలేదు. 'నాట్ రీచబుల్' లేదా 'ఔట్ ఆఫ్ కవరేజ్' ఏరియా అన్న మెసేజ్‌లు వినిపించాయి. కొంతమంది ఫోన్లు కలిసినా అయినా, సిగ్నల్స్ పూర్తిగా బలహీనంగా ఉండడం వల్ల మాటలు సరిగా వినిపించలేదు. జియో నెట్‌వర్క్ నుంచి మెసేజ్‌లు (SMS) కూడా వెళ్లలేదు.
జియో ఫైబర్‌లోనూ సమస్యలు
Jio యొక్క మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు, జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అయిన జియో ఫైబర్ (Jio Fiber)ను ఉపయోగించడంలోనూ యూజర్లు సమస్యలను ఎదుర్కొంటున్నారు. జియో ఫైబర్ సర్వీస్ అకస్మాత్తుగా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు పోస్ట్‌లు పెట్టారు.
ఒక్క గంటలో 10,000లకు ఫిర్యాదు కంప్లైంట్లు
డౌన్ డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల వరకు (ఈ వార్త రాసే వరకు) కూడా జియో నెట్‌వర్క్ మెరుగుపడలేదు, సిగ్నల్ సమస్య కొనసాగింది. డౌన్ డిటెక్టర్ మధ్యాహ్నం నాటికి 10,000కు పైగా ఎర్రర్ రిపోర్ట్‌లను రికార్డ్ చేసింది.
డౌన్ డిటెక్టర్ ప్రకారం, ఈ రోజు మధ్యాహ్నం 12.18 గంటల వరకు, నెట్‌వర్క్ ఎర్రర్‌కు సంబంధించి జియో యూజర్‌ల నుంచి 10,367 రిపోర్ట్‌లు వచ్చాయి. ఉదయం 11.13 గంటలకు 653 రిపోర్ట్‌లు, ఉదయం 10.13 గంటలకు ఏడు రిపోర్ట్‌లు వచ్చాయి. అంటే, గంట వ్యవధిలో (ఉదయం 11.13 గంటల నుంచి మధ్యాహ్నం 12.18 గంటల వరకు) కంప్లైంట్స్ అత్యంత భారీగా పెరిగాయి. వీటిలో... 68 శాతం రిపోర్టుల్లో ఎక్కువ భాగం ‘నో సిగ్నల్’ గురించి ఉన్నాయి. 18 శాతం కంప్లైంట్స్ మొబైల్ ఇంటర్నెట్ గురించి, 14 శాతం ఫిర్యాదులు జియో ఫైబర్ గురించి ఉన్నట్లు వెబ్‌సైట్ చూపించింది.
ఇతర టెల్కో నెట్‌వర్క్‌లు ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా, BSNLలో ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. డౌన్ డిటెక్టర్‌లోని డేటా ప్రకారం, అవన్నీ యథావిధిగా పని చేస్తున్నాయి.
తమ మొబైల్ ఫోన్‌లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ వస్తోంది గానీ జియో నెట్‌వర్క్ అస్సలు రావడం లేదంటూ చాలామంది యూజర్లు 'X' (ట్విట్టర్)లో స్క్రీన్‌షాట్‌లను షేర్ చేశారు. జియో సర్వర్లు డౌన్ కావడంతో, కొంతమంది యూజర్లు రిలయన్స్ జియో కంపెనీని, దాని ఓనర్ & భారతదేశంలోని అతి పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరైన ముఖేష్ అంబానీని (Mukesh Ambani) ట్రోల్ చేయడం ప్రారంభించారు. రకరకాల మీమ్స్‌తో ఒకాట ఆడుకున్నారు. ఈ వార్త రాసే వరకు ఇంత పెద్ద సమస్యపై రిలయన్స్ జియో అధికారికంగా స్పందించలేదు.
మరో ఆసక్తికర కథనం: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ Vs బిగ్ బిలియన్ డేస్, దేనిలో బెస్ట్ ఆఫర్స్ దొరుకుతాయ్?