Swachhata Hi Seva Event In Telugu States: స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా 'స్వచ్ఛతా హీ సేవ 2024' (Swachhata Hi Seva 2024) కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి నిర్వహిస్తున్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. 'స్వభావ్ స్వచ్ఛత - సంస్కార్ స్వచ్ఛత' నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతోనే స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయన్న మహాత్మా గాంధీ నినాదంతో దీన్ని చేపడుతున్నారు. మహాత్ముని జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీల్లో స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ప్రారంభించి పదేళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ దివస్‌ను (Swachhbharat Divas) చేస్తున్నారు.


ప్రధాన కార్యక్రమాలివే



  • తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పల్లెల్లో 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధాన కూడళ్లు, ప్రజోపయోగ స్థలాలు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల్లో చెత్త, మురుగు తొలగిస్తారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజల శ్రమదానంతో పారిశుద్ధ్య పనులు చేపడతారు.

  • కార్యక్రమంలో కంపోస్ట్ షెడ్లలో తడి, పొడి చెత్తను వేరు చేయాలి. చెత్త నుంచి ప్లాస్టిక్, గాజు, ఇతర వస్తువులు వేరుచేయాలి. మిగిలిన తడిచెత్త వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చాలి.

  • అక్టోబర్ 2న చివరి రోజు గ్రామసభల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించేలా ప్రత్యేక తీర్మానాలు చేయాలి. వస్త్ర సంచులు వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. స్వచ్ఛతా ప్రాధాన్యంపై విద్యాలయాల్లో క్విజ్ పోటీల నిర్వహణ, విద్యార్థులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలి.


పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవడం, మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవించడం, స్వచ్ఛతను ఓ జీవన విధానంగా మార్చుకోవడమే.. ప్రతిజ్ఞ చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దేశ పౌరులను భాగస్వాములుగా చేయడమే కాకుండా.. స్వచ్ఛతా కార్యక్రమాల్లో వారిని చురుగ్గా పాల్గొనే అవకాశం 'స్వచ్ఛభారత్' దివస్ ద్వారా కలుగుతుంది.


Also Read: Jagan vs Lokesh: నాణ్యమైన విద్యకు గండి అన్న జగన్ - ఇంతకీ ఏం చదివావో చెప్పాలంటూ లోకేష్ కౌంటర్