Jeff Bezos Yacht Koru: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, తన మారథాన్ డేటింగ్‌ను వివాహ బంధంలోకి మారుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో (Lauren Sanchez) బెజోస్ ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. పెళ్లి కోసం అతను తన ప్రియురాలికి ఒక సూపర్ యాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారని సమాచారం. అయితే, ఎంగేజ్‌మెంట్ విషయాన్ని ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
కళ్లు తిరిగేంత విలువైన గిఫ్ట్
500 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో నిర్మించిన సూపర్ యాచ్‌ని, ఎంగేజ్‌మెంట్ కానుకగా తన ప్రియురాలికి బెజోస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మన రూపాయల్లో చెప్పుకుంటే, ఆ పడవ విలువ 4 వేల 142 కోట్ల రూపాయల పైమాటే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్ యాచ్‌లలో ఇది ఒకటి.
జెఫ్ బెజోస్ లగ్జరీ యాచ్ ప్రత్యేకతలు:
ఈ యాచ్‌లో అనేక ఆకర్షణలు ఉన్నాయి. అన్నిటికంటే మొదట చెప్పుకోవాల్సిన విషయం... పడవ ముందు భాగంలో కనిపించే అందమైన స్త్రీ విగ్రహం గురించి. ఇది, జెఫ్ బెజోస్ స్నేహితురాలు లారెన్ శాంచెజ్ విగ్రహంగా చెబుతారు.
జెఫ్ బెజోస్‌కు చెందిన లగ్జరీ యాచ్ పేరిట ఇప్పటికే చాలా రికార్డులు నమోదయ్యాయి. జెఫ్ బెజోస్ సూపర్ యాచ్ పేరు కోరు (Koru). దీనిని ఓషియానో అనే కంపెనీ తయారు చేసింది. కోరు అనే పేరును, న్యూజిలాండ్ స్థానిక ప్రజలైన మావోరీల వాడుక భాష నుంచి తీసుకున్నారు. కోరు అంటే కొత్త జీవితం, పురోగతి, శాంతి అని అర్ధం.
కోరు, 2022లో మొదటిసారిగా జలప్రవేశం చేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద యాచ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. బోట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ప్రకారం, 127 మీటర్ల పొడవైన ఈ సూపర్ బోట్ అతి పెద్ద డచ్ యాచ్.
కోరు యాచ్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గాలితో పని చేసేలా దీనిని రూపొందించారు, సాంప్రదాయ డీజిల్ ఇంజిన్ దీనిలో లేదు. గాలితో నడవడం కోసం ఈ పడవలో మూడు పెద్ద మాస్ట్‌లు ఏర్పాటు చేశారు. మాస్ట్‌ల ఎత్తు 65 నుంచి 85 మీటర్ల వరకు ఉంటుంది.
ఈ యాచ్ గత ఏడాది తీవ్రమైన వివాదాలను ఎదుర్కోవలసి వచ్చింది. యాచ్‌ను తీసుకెళ్లే మార్గంలో చారిత్రాత్మకమైన కోనింగ్‌షేవెన్ వంతెన ఉంది. ఈ వంతెన దీని ఎత్తు యాచ్ మాస్ట్ కంటే తక్కువ ఎత్తులో ఉంది. దీంతో, పడవ ఆ మార్గంలో వెళ్ళడానికి ఆ వంతెన పగలగొట్టడానికి సిద్ధమయ్యారు. స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో అది మరో దారిలో వెళ్లాల్సి వచ్చింది.
ఈ సూపర్ యాచ్‌లో విలాసవంతమైన సౌకర్యాలకు కొదవ లేదు. డెక్ పూల్, సన్‌డెక్‌లు ఉన్నాయి. ఇది ప్యాలెస్ కంటే తక్కువ కాదని, నీళ్లపై తేలియాడే రాజసౌథం అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పడవలో సినిమా థియేటర్లు, లాంజ్‌లు, జిమ్, రెస్టారెంట్, వ్యాపారపరమైన సమావేశాల కోసం ప్రత్యేక క్యాబిన్లు ఇందులో ఉన్నాయి.
జెఫ్ బెజోస్, తన 25 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టి భార్య మెకంజీ స్కాట్‌తో డివోర్స్ తీసుకున్నారు. భరణంగా 38 బిలియన్ డాలర్లు చెల్లించారు. వీళ్లిద్దరికి నలుగురు పిల్లలు ఉన్నారు. మెకంజీ స్కాట్ నుంచి దూరం కావడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి లారెన్ శాంచెజ్‌కు దగ్గరయ్యారు బెజోస్. 2018 నుంచి ఈ ఇద్దరు డేటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బంధాన్ని ఒక సంవత్సరం పాటు రహస్యంగా ఉంచారు. మెకంజీ స్కాట్‌తో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు, లారెన్ శాంచెజ్‌తో డేటింగ్ విషయాన్ని బయటకు తెలీనివ్వలేదు. ఆ తర్వాత, జులై 14, 2019న, తమ మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం గురించి బెజోస్, సాంచెజ్ అధికారికంగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లి పీటలెక్కుతున్న బెజోస్, ప్రియురాలికి ఇచ్చిన గిఫ్ట్ చూసి ప్రపంచం షాక్