Kaleshwaram Project: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మరో అరుదైన ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్‌సీఈ) సంస్థ నుంచి విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో నిర్వహించిన ‘వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్-2023’లో.. కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ (ఇంజినీరింగ్ ప్రగతికి సుస్థిర ప్రతీక)’గా గుర్తించి అవార్డుతో ఏఎస్‌సీఈ సత్కరించింది.
ఈ సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ అవార్డును మంత్రి కేటీఆర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రభుత్వ నీటి విజయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ప్రాజెక్టులపై ప్రసంగించారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కరువును తరిమేసిన విధానాన్ని, నదినే ఎత్తిపోసిన విధానాన్ని వివరించారు. కాళేశ్వరం ఒక కలికితురాయి అని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ప్రణాళిక, వినూత్న ఆలోచనలు, నిశితమైన అమలుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. అలాగే వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన మైలు రాళ్లను ప్రపంచమంతా గుర్తించవచ్చని మంత్రి అన్నారు. అభివృద్ధి పట్ల ఎడతెగని మక్కువతో సీఎం కేసీఆర్ దశాబ్దాల నాటి తెలంగాణ నీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులకు స్వర్గదామమని వివరించారు. కంపెనీల సీఈఓలతో మంత్రి కీటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలోనూ విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించడంతో పాటు ఇక్కడ ఉన్న అనుకూలతలు, తాము కల్పించిన మౌలిక వసతులపై మాట్లాడారు. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లలో ఐటీ టవర్లను ప్రారంభించుకున్నామన్న కేటీఆర్, త్వరలోనే సిద్దిపేట, నిజామాబాద్ , నల్గొండలోనూ ఐటీ టవర్ల నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్పారు. దీంతోపాటు ఆదిలాబాద్ లోనూ మరొక ఐటీ టవర్ నిర్మిస్తున్నామన్నారు.