కొంతమంది తల్లులు బిడ్డలకు ఎక్కువ కాలం తల్లి పాలు ఇవ్వరు. రెండు మూడు నెలలకే నిలిపివేస్తారు. కానీ ఎక్కువ కాలం పాటు తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికీ, బిడ్డకీ ఇద్దరికీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాల నుండి ఆ ఇద్దరు బయటపడే అవకాశాలు ఎక్కువ. వారికి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని ఇటీవలే కొన్ని అధ్యయనాలు తెలిపాయి. క్యాన్సర్ నుండి పిల్లలను రక్షించడంలో తల్లిపాలు కీలక పాత్ర పోషిస్తాయని చెబుతోంది కొత్త అధ్యయనం.
తల్లిపాలలో యాంటీ బాడీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడతాయి. తల్లిపాలను పుట్టినప్పటినుంచి ఎక్కువ కాలం పాటు తాగితే లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ అధ్యయనాన్ని 18,000 మంది పిల్లల డేటాను విశ్లేషించిన తర్వాత చేశారు. చాలా తక్కువ కాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లలతో పోలిస్తే 6 నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు పాలు తాగిన పిల్లల్లో లుకేమియా వచ్చే అవకాశం చాలా వరకు తగ్గినట్టు కనుగొన్నారు అధ్యయనకర్తలు. అంతేకాదు ఎక్కువ కాలం పాటు తల్లిపాలు తాగిన పిల్లల్లో న్యూరోబ్లాస్టోమా అనే సమస్య వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
తల్లిపాలు ఎక్కువ కాలం ఇవ్వడం వల్ల తల్లికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆమె త్వరగా బరువు తగ్గుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ. తల్లిపాలలో హ్యూమన్ మిల్క్ ఒలిగోసాకరైట్స్ వంటి బయోయాక్టివ్ పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే ఈ పాలు తాగిన పిల్లలు బలిష్టంగా, ఆరోగ్యంగా ఉంటారు. తల్లిపాలు ఎక్కువ కాలం పాటు తగిన పిల్లల్లో ‘సడెన్ డెత్ సిండ్రోమ్’ వంటి సమస్యలు రావు. శ్వాసకోశ, జీర్ణాశయంతర ఇన్ఫెక్షన్ నుండి తల్లిపాలు కాపాడతాయి. పెద్దయ్యాక కూడా ఎలర్జీలు, ఉబ్బసం, ఊబకాయం వంటివి వచ్చే అవకాశాలు తక్కువ. తల్లిపాలు ఎక్కువ కాలం పాటు తగిన పిల్లల్లో ప్రాణాంతక సమస్యలు వచ్చే ఛాన్సులు తక్కువగా ఉంటాయి. అందుకే కచ్చితంగా తల్లి... శిశువులకు ఏడాది వరకు పాలు పెట్టాలి.
తల్లి పాలు తాగించడం వల్ల తల్లికి కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గర్భం ధరించినప్పుడు పెరిగిన బరువును త్వరగా తగ్గుతారు. పిల్లలకు పాలు పెట్టని తల్లులు బరువు తగ్గడం కష్టంగా మారుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
Also read: జుట్టు ద్వారా మీకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందో లేదో చెప్పేయచ్చు
Also read: పచ్చళ్లు, ఆవకాయల తయారీలో ఆవనూనెనే ఎందుకు వాడతారు?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.