Jeff Bezos Girlfriend: అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో (Lauren Sanchez) బెజోస్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు అంతర్జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయి. పెళ్లి కోసం అతను తన ప్రియురాలికి అత్యంత ఖరీదైన సూపర్‌ గిఫ్ట్‌ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.


జెఫ్ బెజోస్, అతని ప్రియురాలు లారెన్ శాంచెజ్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌ టూర్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఒక ఇంటివాళ్లు కాబోతున్నట్ల చాలా కాలంగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. లారెన్ శాంచెజ్ వేలికి లవ్‌ సింబల్‌ రూపంలో ఉన్న ఉంగరం కనిపించినప్పటి నుంచి రూమర్లు ఇంకా పెరిగాయి.


2018 నుంచి లారెన్‌తో డేటింగ్
జెఫ్ బెజోస్, లారెన్ 2018 నుంచి డేటింగ్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ బంధాన్ని ఒక సంవత్సరం పాటు రహస్యంగా ఉంచారు. ఆ తర్వాత, జులై 14, 2019న తమ మధ్య సాగుతున్న ప్రేమ వ్యవహారం గురించి బెజోస్, సాంచెజ్ అధికారికంగా ప్రకటించారు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో, ప్రిన్స్ విలియం, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్‌తో కలిసి వీరిద్దరూ కనిపించారు.


జెఫ్ బెజోస్ ప్రియురాలి స్టోరీ ఏంటి?
జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలిగా అత్యంత విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తున్న లారెన్‌, గతంలో జర్నలిస్ట్‌గా, న్యూస్ యాంకర్‌గా పని చేశారు. ప్రస్తుతం, బెజోస్ ఎర్త్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు, దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆమెకు హెలికాప్టర్ పైలట్ లైసెన్స్ కూడా ఉంది. ఏరియల్ ఫోటోగ్రఫీ కోసం ఒక ఏవియేషన్‌ కంపెనీని కూడా ప్రారంభించారు. లారెన్‌కు, గతంలో పాట్రిక్‌ వైట్‌సెల్‌ అనే వ్యక్తితో వివాహమైంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాజీ NFL ప్లేయర్‌ టోనీ గోంజలెజ్‌తోనూ ఆమె కలిసి జీవించింది, అతని ద్వారా ఒక కుమారుడికి జన్మనిచ్చింది.


జెఫ్ బెజోస్, తన 25 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి భార్య మెకంజీ స్కాట్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికి నలుగురు పిల్లలు ఉన్నారు. మెకంజీ స్కాట్‌ నుంచి దూరం కావడం మొదలు పెట్టిన దగ్గర్నుంచి లారెన్ శాంచెజ్‌కు దగ్గరయ్యారు బెజోస్‌. మెకంజీ స్కాట్‌తో విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు, లారెన్ శాంచెజ్‌తో డేటింగ్‌ విషయాన్ని బయటకు తెలీనివ్వలేదు.


ఖరీదైన సూపర్‌ యాచ్‌ బోట్ ప్రియురాలికి అంకితం
జెఫ్ బెజోస్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. తన సంపదకు తగ్గట్లుగా రిచ్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తుంటారు, ఎప్పుడూ న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ఉంటారు. ఇప్పుడు, లారెన్ శాంచెజ్‌తో నిశ్చితార్థం, ఆమెకు ప్రజెంట్‌ చేసిన గిఫ్ట్‌ విషయమై మళ్లీ వార్తల్లోకి వచ్చారు. బెజోస్, $500 మిలియన్ల విలువైన పడవను ప్రియురాలికి కానుకగా ఇచ్చాడట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌ బోట్లలో ఇది ఒకటి. పడవ ముందు భాగం మీద అతని ప్రియురాలి విగ్రహం ఉంది. ఆ సూపర్‌ యాచ్ పేరు కోరు. దీనిని ఓషియానో అనే కంపెనీ తయారు చేసింది.


ఇది కూడా చదవండి: దిగి వస్తున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి