Income Tax Return Filing 2024: శీర్షిక చదివి వార్తలోకి వచ్చారా?. నిజమే, మరణించిన వ్యక్తి కూడా ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయాలి. ఇది ఎలా సాధ్యం, మరణించిన వ్యక్తి ఎలా తిరిగొస్తాడు, అతని ఆత్మ వచ్చి ITR ఫైల్‌ చేస్తుందా లాంటి ప్రశ్నలు ఇప్పటికే మీ బుర్రలోకి వచ్చి ఉంటాయి. ఈ వార్త పూర్తిగా చదివితే మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది.


సాధారణంగా, బతికి ఉన్న వ్యక్తులు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేస్తారు. అయితే, ఓ వ్యక్తి చనిపోయినప్పటికీ, అతని పేరిట కొన్ని ఆస్తులు ఉండొచ్చు. వాటి నుంచి లాభం లేదా రాబడి వస్తూనే ఉంటుంది. ఇలాంటి కేస్‌లో, మరణించిన వ్యక్తి పేరిట 'పన్ను చెల్లించదగిన ఆదాయం' (Taxable income) ఉంటే, ఆదాయ పన్ను చట్టం (Income Tax Act) ప్రకారం రిటర్న్ దాఖలు చేయాలి. మరణించిన వ్యక్తి ఎలా బతికొస్తాడని మళ్లీ డౌట్‌ వచ్చింది కదా. దీనికి సమాధానం... చనిపోయిన వ్యక్తి పేరిట అతని చట్టబద్ధ వారసుడు (legal heir) ఆదాయ పన్ను పత్రాలు సమర్పించాలి.


చనిపోయిన వ్యక్తి పేరిట ITR ఫైల్‌ చేసేందుకు ప్రత్యేక పద్ధతి ఉందా?
మరణించిన వ్యక్తి తరపున ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ప్రత్యేక పద్ధతంటూ ఏమీ లేదు. బతికి ఉన్న వ్యక్తులు సమర్పించినట్లుగానే, చనిపోయిన వ్యక్తి తరపున అతని 'లీగల్‌ హైర్‌' ITR సబ్మిట్‌ చేస్తాడు. ఇంట్లో కూర్చొనే ఈ పని పూర్తి చేయొచ్చు. ఇక్కడ ఒక నియమాన్ని మాత్రం పాటించాలి. చనిపోయిన వ్యక్తికి తానే చట్టబద్ధ వారసుడిని అని ప్రకటిస్తూ, ITR ఫైల్‌ చేసే వ్యక్తి ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ తర్వాతే, చనిపోయిన వ్యక్తి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ఐటీ డిపార్ట్‌మెంట్‌ అంగీకరిస్తుంది. 


మరణించిన వ్యక్తి పేరిట ITR ఫైల్ చేయడానికి చట్టబద్ధ వారసుడిగా ఎలా నమోదు చేసుకోవాలి?
www.incometaxindiaefiling.gov.in/home లింక్‌ ద్వారా ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి.
మీ యూజర్‌ ఐడీ (PAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ చేసి, 'మై అకౌంట్‌'లోకి వెళ్లాలి.
ఆ తర్వాత మిమ్మల్ని రిప్రజెంటివ్‌గా నమోదు చేసుకోండి.
ఇప్పుడు 'న్యూ రిక్వెస్ట్‌'లోకి వెళ్లి కంటిన్యూ బటన్‌ నొక్కండి.
మరణించిన వ్యక్తి పాన్‌, పేరు, బ్యాంక్ అకౌంట్‌ నంబర్‌ వంటి వివరాలను ఇక్కడ నింపండి.
అన్ని గడులు నింపాక రిజిస్ట్రేషన్‌ కోసం ఐటీ డిపార్ట్‌మెంట్‌కు రిక్వెస్ట్‌ పంపండి.
మీ అభ్యర్థనను ఆదాయ పన్ను విభాగం పరిశీలిస్తుంది, అన్ని వివరాలు సక్రమంగా ఉంటే ఆమోదిస్తుంది.


మరణించిన వ్యక్తికి సంబంధించిన ITR ఎలా ఫైల్ చేయాలి?
ఐటీ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న తర్వాత ITR ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆ ఫామ్‌లో అడిగిన అన్ని వివరాలను నింపాలి.
ఆ ఫారాన్ని XML ఫైల్‌ ఫార్మాట్‌లోకి మార్చండి. ఎందుకంటే, ఆ ఫైల్‌ను XML ఫార్మాట్‌లో మాత్రమే అప్‌లోడ్ చేయగలరు.
పాన్ కార్డ్ వివరాలు అడిగిన కాలమ్‌లో, చట్టబద్ధ వారసుడి (legal heir) వివరాలు ఇవ్వాలి.
ఇప్పుడు ITR ఫారం రకం, అసెస్‌మెంట్ ఇయర్‌ ఎంచుకోండి.
XML ఫార్మాట్‌లోని ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.
చివరిగా, డిజిటల్‌ సైన్‌ ద్వారా ఐటీఆర్‌ సబ్మిట్‌ చేయండి.


ఇలా ఎంతకాలం ఐటీఆర్‌ దాఖలు చేయాలి?
ఎంతోకాలం అవసరం లేదు. ఆ వ్యక్తి జీవించి ఉన్న రోజు వరకు వచ్చిన ఆదాయంపై రిటర్న్ దాఖలు చేస్తే సరిపోతుంది. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఆ వ్యక్తి చేసిన ఖర్చులు, పెట్టుబడులపై మినహాయింపులను కూడా క్లెయిమ్‌ చేయవచ్చు. ఆ తర్వాత, వర్తించే స్లాబ్‌ స్టిస్టమ్‌ ప్రకారం పన్ను చెల్లించాలి. ఒకవేళ టాక్స్‌ రిఫండ్‌ ఉంటే, దానిని కూడా క్లెయిమ్ చేయవచ్చు.


ఐటీఆర్‌ ఫైల్‌ చేయకపోతే ఏం జరుగుతుంది?
పన్ను చెల్లించదగిన ఆదాయం ఉండి కూడా ఐటీఆర్‌ ఫైల్‌ చేయకపోతే, జీవించి ఉన్న వ్యక్తి విషయంలో ఆదాయ పన్ను విభాగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, చనిపోయిన వ్యక్తి విషయంలోనూ అదే విధానం అవలంబిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: బ్యాంకు అకౌంట్‌, క్రెడిట్‌ కార్డు ఉన్నవారి బీపీ పెంచే న్యూస్ - ఇలా డిపాజిట్‌ చేస్తే ఐటీ నోటీసు ఖాయం!