ITC Q4 Results: 2023 మార్చి త్రైమాసికంలో, ITC లిమిటెడ్ రూ. 5,175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలోని రూ. 4,196 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 23% ఎక్కువ లాభాన్ని సాధించింది.


జనవరి-మార్చి కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 7% వృద్ధి చెంది రూ. 19,058 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ నంబర్‌ రూ. 17,754 కోట్లుగా ఉంది.


సెగ్మెంట్ల వారీగా ఆదాయ వివరాలు:


ITCకి ఎన్ని రకాల వ్యాపారాలున్నా, అత్యధిక ఆదాయం అందించేది సిగరెట్ల వ్యాపారం. సమీక్ష కాల త్రైమాసికంలో, సిగరెట్‌ సెగ్మెంట్‌ ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13% పెరిగి రూ. 8,082 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ.7,177 కోట్లుగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో పన్నుకు ముందు లాభం (PBT) ఏడాది ప్రాతిపదికన 13% పెరిగి రూ. 4,916 కోట్లకు చేరుకుంది.


జనవరి-మార్చి కాలంలో FMCG-ఇతరాల విభాగం నుంచి వచ్చిన ఆదాయం రూ. 4,951 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలోని రూ. 4,148 కోట్ల కంటే ఇప్పుడు 19% పెరిగింది. ఈ సెగ్మెంట్‌ PBT రెండింతలు పెరిగి రూ. 504 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ. 238 కోట్లుగా ఉంది. 


ITC గ్రూప్‌లోని హోటల్ వ్యాపారం బంపర్‌ రాబడి అందించింది. సంవత్సరానికి 99% వృద్ధిని నమోదు చేసి రూ. 809 కోట్లకు చేరుకుంది. మునుపటి సంవత్సరం ఇదే త్రైమాసికంలోని రూ. 238 కోట్ల నుంచి ఇది దాదాపు రెట్టింపైంది. ఈ విభాగంలో, పన్ను ముందు లాభంలో విపరీతమైన వృద్ధి కనిపించింది. 2022 మార్చి త్రైమాసికంలోని రూ. 29 కోట్ల నష్టంతో పోలిస్తే ఇప్పుడు రూ. 205 కోట్ల పన్ను ముందు లాభాన్ని నమోదు చేసింది.


వ్యవసాయం & పేపర్‌ బోర్డ్ వ్యాపారం మినహా అన్ని విభాగాల్లో ఆరోగ్యకరమైన వృద్ధిని ITC సాధించింది.


వ్యవసాయ-వ్యాపార ఆదాయం ఏడాది ప్రాతిపదికన 17% తగ్గి రూ. 3,607 కోట్లకు చేరుకుంది. పేపర్‌ బోర్డ్‌ & ప్యాకేజింగ్ వ్యాపారం స్వల్పంగా 1.7% పెరిగి రూ. 2,221 కోట్లకు చేరుకుంది.


ఒక్కో షేర్‌కు రెండు డివిడెండ్స్‌


ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 6.75 తుది డివిడెండ్, రూ. 2.75 ప్రత్యేక డివిడెండ్ ఇవ్వాలని బోర్డు సిఫార్సు చేసింది. మొత్తం కలిపితే, షేర్‌ హోల్డర్లకు ఒక్కో షేర్‌కు 9.50 రూపాయల డివిడెండ్‌ లభిస్తుంది. 


గతంలో ఒక్కో షేరుకు ఇచ్చిన రూ. 6 మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలిపితే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తానికి డివిడెండ్ రూ. 15.50 అవుతుంది.


అర్హత గల సభ్యులకు ఆగస్టు 14-17 తేదీల మధ్య డివిడెండ్‌ చెల్లిస్తారు. షేర్ హోల్డర్ల అర్హతను గుర్తించేందుకు మే 30ని రికార్డు తేదీగా కంపెనీ బోర్డ్‌ నిర్ణయించింది. ఈ రికార్డ్‌ డేట్‌ నాటికి ఎవరైతే ఈ షేర్లను హోల్డ్‌ చేస్తారో లేదా కొంటారో, డివిడెండ్‌ పొందడానికి వాళ్లు అర్హత సాధిస్తారు.


ఫలితాల ప్రకటన అనంతరం, ఇవాళ (గురువారం, 18 మే 2023) ఐటీసీ షేరు 2.05 శాతం తగ్గి రూ. 418.85 వద్ద నిలిచాయి.


ఇది కూడా చదవండి: మూడో రోజూ నష్టాలే! భయపెడుతున్న యూఎస్‌ దివాలా భయం!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.