IBM Sick Leave: అంతర్జాతీయ స్థాయి కంపెనీలు తమ ఉద్యోగులను చక్కగా చూసుకుంటాయి, అవసరానికి తగ్గట్లు సెలవులు అందుబాటులో ఉంచుతాయి. అత్యవసర పరిస్థితులు వస్తే సుదీర్ఘ సెలవులకు అనుమతి ఇస్తాయి. బహుళ జాతి కంపెనీల్లో (MNCs) పని చేసే ఉద్యోగి అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లయితే, అతను అనారోగ్య సెలవుపై (sick leave) వెళ్ళవచ్చు. చాలా కంపెనీలు, అనారోగ్య సెలవు సమయంలోనూ కొన్ని నెలల పాటు ఆ ఉద్యోగికి జీతం చెల్లిస్తూనే ఉంటాయి. ఆ తర్వాత జీతం లేని సెలవు తీసుకోవలసి వస్తుంది. తాజాగా, సిక్‌ లీవ్‌కు సంబంధించిన ఒక కేసు తెరపైకి వచ్చింది. దీని నేపథ్యం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.


పని చేయకపోయినా ఏటా రూ.55 లక్షల జీతం
అంతర్జాతీయ టెక్‌ దిగ్గజం IBMకు చెందిన వ్యవహారం ఇది. ఈ సంస్థకు చెందిన ఒక ఉద్యోగి గత 15 సంవత్సరాలుగా అనారోగ్యంతో సెలవులో ఉన్నాడు. ఈ 15 సంవత్సరాలుగా కంపెనీ కూడా అతనికి జీతం ఇస్తూనే ఉంది. అతని జీతం తక్కువ మాత్రం కాదు, సంవత్సరానికి 54 వేల పౌండ్లకు పైగా తీసుకుంటున్నాడు. భారతీయ రూపాయల్లో చెబితే, సంవత్సరానికి 55 లక్షల రూపాయలు అవుతుంది. అంటే, గత 15 సంవత్సరాలుగా పని చేయకుండానే ఆ ఉద్యోగి ఏటా 55 లక్షల రూపాయల జీతం పుచ్చుకుంటున్నాడు. అయితే, ఆ ఉద్యోగి లెక్క ప్రకారం ఇది చాలా తక్కువ చెల్లింపు. 


ఈ విషయంపై సదరు ఉద్యోగి IBM కంపెనీ మీద కోర్టులో కేసు వేశాడు. అతనికి గత 15 ఏళ్లుగా జీతం పెంచలేదట, కంపెనీ అతనిపై వివక్ష చూపిందట. ఈ 15 ఏళ్లలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని, అయితే తన జీతం మాత్రం అప్పటి నుంచి స్థిరంగానే ఉందని ఆ ఉద్యోగి ఆరోపించాడు. కాబట్టి, తాను నష్టపోయానని కోర్టులో వాదించాడు.


స్టోరీ బ్యాక్‌గ్రౌండ్‌ ఇది
బ్రిటిష్ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ రిపోర్ట్‌ ప్రకారం, ఈ కేసు పెట్టింది ఇయాన్ క్లిఫోర్డ్ ‍‌(Ian Clifford) అనే ఉద్యోగి. 2000 సంవత్సరంలో 'లోటస్ డెవలప్‌మెంట్' అనే కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత, లోటస్ డెవలప్‌మెంట్‌ను IBM కొనుగోలు చేసింది. దీంతో, క్లిఫోర్డ్ IBM ఉద్యోగి అయ్యాడు. 2008లో అతను అనారోగ్య సెలవుపై వెళ్లాడు. గత ఐదేళ్లలో, అంటే 2008 నుంచి 2013 వరకు తనకు జీతం పెంచలేదని ఆరోపించాడు. కోర్టులో కేసు వేసినా అతని జీతాన్ని IBM ఆపలేదు. అతను కంపెనీ నుంచి ప్రతి సంవత్సరం 54,028 పౌండ్లు, అంటే దాదాపు 55.34 లక్షల రూపాయలు పొందుతున్నాడు. ఈ విధంగా, గత 15 ఏళ్లలో IBM నుంచి 8 కోట్ల రూపాయలకు పైగా డ్రా చేశాడు. 


కోర్టు ఇచ్చిన తీర్పు ఇది
క్లిఫోర్డ్ సమస్యను పరిష్కరించడానికి అతనిని 'కంపెనీ వైకల్య ప్రణాళిక'లో భాగంగా చేసినట్లు IBM వెల్లడించింది. ఈ ప్లాన్‌ కింద, ఆ ఉద్యోగి పని చేయకపోయినా అతనికి 65 ఏళ్లు వచ్చే వరకు జీతంలో 75 శాతం ఇస్తామని కోర్టుకు తెలిపింది. ద్రవ్యోల్బణం పెరిగింది కాబట్టి ఆ మొత్తం సరిపోదు, తన జీతం పెంచాల్సిందే అన్నది క్లిఫోర్డ్ డిమాండ్. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం, క్లిఫోర్డ్ డిమాండ్‌ను తిరస్కరించింది. ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగి, అతను పొందుతున్న మొత్తం విలువ తగ్గినప్పటికీ, అది ఇప్పటికీ మంచి మొత్తమేనని కోర్టు పేర్కొంది. కాబట్టి, క్లిఫోర్డ్ డిమాండ్‌లో న్యాయం లేదని తీర్పు చెప్పింది. 


ఇది కూడా చదవండి: మీ డబ్బు పొరపాటున వేరే నంబర్‌కు వెళ్లిందా? గాభరా పడొద్దు, తిరిగి వస్తుంది