KTR Foxconn :   రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో ఏర్పాటు చేస్తున్న ఫాక్స్‌కాన్‌  టెక్నాలజీస్‌ ప్లాంట్‌కు మంత్రి కేటీఆర్‌  భూమిపూజ చేశారు. పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం 196 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సుమారు రూ.1,656  కోట్లకుపైగా పెట్టుబడితో ఫాక్స్‌కాన్‌ ఇక్కడ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది.  ఇందులో దాదాపు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వ  వర్గాలు చెబుతున్నాయి.       


 





                          


ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. ఫాక్స్‌కాన్‌ సంస్థకు ప్రభుత్వం అన్నిరకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఫాక్స్ కాన్   పెట్టుబడి పెట్టడానికి తెలంగాణను ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 9 ఏళ్లుగా తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందని అన్నారు. భారత్​లో క్రియేట్​ అయ్యే ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలోనే క్రియేట్ అవుతోందన్నారు.  రాష్ట్ర ఆవిర్భావం తరువాత కొత్తగా 23 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, సీఎం కేసీఆర్​ నాయకత్వంలో రాష్ర్టం పురోభివృద్ధి సాధిస్తోందన్నారు. కంపెనీలో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.                                     


యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఫాక్స్‌కాన్‌ తెలంగాణకు ఐకాన్‌గా నిలువనుందని చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని భవిష్యత్‌లో సంస్థతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గతేడాది దేశంలో కల్పించిన ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణలో ఇచ్చామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని చెప్పారు. మరో 10 ఏండ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.                                                    


మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతిగాంచిన సంస్థ ఫాక్స్‌కాన్‌. సుమారు 70 శాతం యాపిల్‌ ఐఫోన్లను ఫాక్స్‌కాన్‌ కంపెనీయే తయారు చేస్తున్నది. యాపిల్‌ సంస్థ నుంచి ఇప్పటికే ఫాక్స్‌కాన్‌కు భారీ ఆర్డర్‌ రావడంతో వచ్చే ఏడాది చివరికల్లా ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకొన్నది. యాపిల్‌ కంపెనీ ఎయిర్‌పాడ్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్ల తయారీ ఆర్డర్‌ను ఫాక్స్‌కాన్‌కు అప్పగించింది. ఇప్పటివరకూ మొబైల్‌ ఫోన్ల తయారీకే ప్రాధాన్యమిచ్చిన ఫాక్స్‌కాన్‌, ఇప్పుడు ఎయిర్‌పాడ్‌ల తయారీలోకి అడుగు పెడుతున్నది.