Infosys CEO Salil Parekh Salary: ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తీసుకున్న జీతం వార్తల్లో హెడ్‌లైన్‌గా మారింది. ఆయన, ఇన్ఫోసిస్ నుంచి ఏడాదికి రూ. 66 కోట్లకు పైగా భారీ వేతన ప్యాకేజీని అందుకున్నారు. దీంతో, ఐటీ రంగంలో అత్యధికంగా సంపాదిస్తున్న సీఈవోల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. విప్రో మాజీ CEO థియరీ డెలాపోర్టే (Thierry Delaporte) మాత్రమే అతని కంటే ఎక్కువ ప్యాకేజీ అందుకున్నారు. డెలాపోర్టే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి విప్రో నుంచి దాదాపు రూ. 166 కోట్లు (20 మిలియన్‌ డాలర్లు) తీసుకున్నారు. 


శ్రీనివాస్ పల్లియా, కె కృత్తివాసన్ కంటే ఎక్కువ జీతం 
జీతం పరంగా చూస్తే... విప్రో సీఈవో శ్రీనివాస్ పల్లియా (Wipro CEO Srinivas Pallia), టాటా కన్సస్టెన్సీ సర్వీసెస్‌ ఎండీ & సీఈవో కె కృతివాసన్‌ను (TCS MD & CEOK Krithivasan) సలీల్ పరేఖ్ అధిగమించారు. ఇన్ఫోసిస్‌ వార్షిక నివేదిక నుంచి అందిన సమాచారం ప్రకారం, గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) ఆ కంపెనీ ఎండీ & సీఈవో సలీల్ పరేఖ్ అందుకున్న జీతం దాదాపు రూ. 66.25 కోట్లు. 2022-23లో తీసుకున్న రూ. 56.4 కోట్ల వార్షిక ప్యాకేజీతో పోలిస్తే ఇది 17% ఎక్కువ. థియరీ డెల్‌పోర్ట్ స్థానంలో విప్రో కొత్త సీఈవోగా వచ్చిన శ్రీనివాస్ పల్లియా 2024-25 ఆర్థిక సంవత్సరానికి దాదాపు రూ. 50 కోట్లు అందుకోనున్నారు. మరోవైపు, 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, కె కృతివాసన్‌కు టీసీఎస్ రూ. 25.36 కోట్లు ఇచ్చింది. మన దేశంలోని పెద్ద ఐటీ కంపెనీల సీఈవోల్లో కృతివాసన్ జీతమే తక్కువ.


రూ. 7 కోట్ల బేసిక్ పే, రూ. 7.47 కోట్ల బోనస్
సలీల్ పరేఖ్, 2023-24 ఆర్థిక సంవత్సరానికి బేసిక్ పే రూరంలో రూ. 7 కోట్లు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌గా రూ. 47 లక్షలు, బోనస్‌గా రూ. 7.47 కోట్లు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్లుగా రూ. 39.03 కోట్లు, వేరియబుల్‌ పే కింద రూ. 19.75 కోట్లను అందుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ లాభాలను కొనసాగించామని వాటాదార్లకు రాసిన లేఖలో సలీల్ పరేఖ్ తెలిపారు. క్లయింట్‌లతో సన్నిహితంగా పనిచేస్తూ, సుమారు 17.7 బిలియన్‌ డాలర్ల విలువైన పెద్ద ఒప్పందాలు దక్కించుకున్నట్లు వివరించారు. కంపెనీకి వచ్చిన లాభాలను గత 5 సంవత్సరాలు వాటాదార్లతో పంచుకున్నట్లు ఆ లేఖలో వెల్లడించారు.


11,900 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు
సలీల్ పరేఖ్ రాసిన లేఖలోని వివరాల ప్రకారం, క్యాంపస్ ఎంపికల ద్వారా దాదాపు 11,900 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చారు. 2024 మార్చి 31 నాటికి కంపెనీలో దాదాపు 3,17,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2.50 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో (AI) శిక్షణ ఇచ్చారు. కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 39 శాతం మంది మహిళలు. కంపెనీ అట్రిషన్ రేటు 12.6 శాతానికి తగ్గింది.


మరోవైపు... ఇన్ఫోసిస్‌ ఛైర్మన్‌ నందన్‌ నీలేకని ‍‌(Infosys Chairman Nandan Nilekani) మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కంపెనీ కోసం పని చేసినందుకు పారితోషికం తీసుకోకూడదని ఆయన స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారని వార్షిక నివేదికలో ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.


మరో ఆసక్తికర కథనం: రైతులు కూడా పన్ను చెల్లించాలి, వ్యవసాయ ఆదాయంపై టాక్స్‌ లేదనుకోవడం అపోహ