Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా మదింపు సంవత్సరం 2024-25 కోసం ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే సీజన్ జోరుగా సాగుతోంది. ITR ఫైలింగ్‌కు ఈ ఏడాది జులై 31 వరకు గడువుంది. మన దేశంలో, దాదాపు అన్ని రకాల ఆదాయంపై పన్ను చెల్లించాలి. జీతగాళ్లు, వ్యాపారులు, వృత్తి నిపుణులంతా రిటర్న్‌లు దాఖలు చేయాలి. రైతులు కూడా ఈ కోవలోకి వస్తారు.


వ్యవసాయం నుంచి సంపాదించిన మొత్తంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని, రైతుగా ఉన్న వ్యక్తి ఐటీఆర్‌ ఫైల్‌ చేయనక్కర్లేదన్న అపోహ చాలామందిలో ఉంది. వ్యవసాయానికి సంబంధించి, అన్ని రకాల ఆదాయాలు పన్ను రహితం కావు.


ఆదాయ పన్ను నియమాల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో, వ్యవసాయం నుంచి సంపాదించిన ఆదాయంలో కేవలం 5,000 వరకే పన్ను మినహాయింపు లభిస్తుంది. వ్యవసాయం కాకుండా, ఒక రైతు ఇతర రూపాల్లో సంపాదించినా టాక్స్‌ కట్టాలి. ఉదాహరణకు.. రైతు తన పొలాన్ని అమ్మి లాభం సంపాదిస్తే, దానిపై మూలధన లాభాల పన్ను (Capital Gains Tax) చెల్లించాలి. 


వ్యవసాయ భూమికి సంబంధించి రైతులు కీలక నిబంధనలు అర్ధం చేసుకోవాలి: 


- వ్యవసాయం చేస్తున్నంత మాత్రాన అన్ని భూములను వ్యవసాయ భూములుగా పరిగణించరు. 
- వ్యవసాయం చేస్తున్న భూమి మున్సిపాలిటీ, నోటిఫైడ్ ఏరియా కమిటీ, టౌన్ ఏరియా కమిటీ లేదా కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉండి, ఆ ప్రాంత జనాభా 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆ భూమి వ్యవసాయ భూమి కాదు. 
- ఒక ప్రాంత జనాభా 1 లక్ష వరకు ఉంటే.. ఆ ఏరియాకి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. 
- జనాభా 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య ఉంటే, 6 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న భూమి అగ్రికల్చర్‌ ల్యాంగ్‌గా లెక్కలోకి రాదు. 
- జనాభా 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే, 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు.


సాధారణ భాషలో వీటిని పట్టణ వ్యవసాయ భూములు అంటారు. ఈ భూముల విక్రయం ద్వారా వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కూడా రెండు విధాలుగా ఉంటుంది. పట్టణ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన తేదీ నుంచి 24 నెలలలోపు లాభానికి విక్రయిస్తే, ఆ లాభంపై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (STCG Tax) చెల్లించవలసి ఉంటుంది. ఇది మీ టాక్స్‌ స్లాబ్ ప్రకారం వర్తిస్తుంది. కొన్న తేదీ నుంచి 24 నెలల తర్వాత భూమిని విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (LTCG Tax) చెల్లించాలి. ఈ కేస్‌లో.. ఇండెక్సేషన్ ప్రయోజనం తర్వాత 20 శాతం పన్ను చెల్లించాలి.


పన్ను నుంచి తప్పించుకోవచ్చు!
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 54 (B) ప్రకారం మూలధన లాభాల పన్నును తప్పించుకోవచ్చు. పట్టణ వ్యవసాయ భూమి అమ్మకం ద్వారా వచ్చే మొత్తం డబ్బుతో ఏడాది వ్యవధిలో మరో వ్యవసాయ భూమిని కొంటే, ఈ కేస్‌లో మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పొలం అమ్మిన మొత్తం డబ్బుతో ఏడాది వ్యవధిలో ఇల్లు కొన్నా కూడా పన్ను ఆదా చేయవచ్చు. ఒకవేళ, ఆ డబ్బుతో ఇంటిని నిర్మించానుకుంటే, పన్ను మినహాయింపు పొందడానికి 3 సంవత్సరాల వరకు గడువు లభిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: రెండ్రోజుల్లో RBI MPC సమావేశం - ఈసారైనా వడ్డీ రేట్లు తగ్గుతాయా?