Flipkart Offers And Prices: ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మీద సోషల్‌ మీడియాలో సరికొత్త విమర్శలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా వివిధ వస్తువులను అమ్ముతున్న ఈ కంపెనీ, వాటి రేట్ల విషయంలో ఐఫోన్‌ యూజర్లు, ఆండ్రాయిడ్‌ యూజర్ల మధ్య వివక్ష చూపిస్తోందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఐవోఎస్‌ (iOS) లేదా ఆండ్రాయిడ్‌ (Android) సాఫ్ట్‌వేర్లను వాడుతున్న ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల నుంచి ఫ్లిప్‌కార్ట్‌ యాప్‌ను యాక్సెస్‌ చేయొచ్చు, వస్తువులను ఆర్డర్‌ చేయచ్చు. ఐఫోన్లలో iOS సాఫ్ట్‌వేర్‌ వాడుతుండగా, ఇతర స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌ మీద నడుస్తున్నాయి.


ఐఫోన్‌లో ఒకలా - ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో మరొకలా..
ఫ్లిప్‌కార్ట్‌లో అమ్ముతున్న ఒకే వస్తువు రేటు iPhoneలో ఒకలా, Android ఫోన్‌లో మరొకలా (ఒకే వస్తువుకు ఐఫోన్‌ కంటే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో తక్కువ రేటు) కనిపిస్తోందంటూ సౌరభ్‌ శర్మ అనే యూజర్‌ తన X అకౌంట్‌లో (గతంలో Twitter) ఒక పోస్ట్ పెట్టాడు. ఒకే ఉత్పత్తికి సంబంధించి, రెండు ఫోన్లలో కనిపిస్తున్న ధర వ్యత్యాసాన్ని స్క్రీన్‌ షాట్లు తీసి షేర్‌ చేశాడు. మోకోబారా క్యాబిన్ సూట్‌కేస్ ధర ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో 65 శాతం తగ్గింపుతో రూ. 4,119గా ఉండగా, అదే సూట్‌కేస్‌ ఐఫోన్‌లో 60 శాతం తగ్గింపుతో రూ. 4,799గా ఉంది.


"ఆండ్రాయిడ్ vs iOS - ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో వేర్వేరు ధరలు" అంటూ తన పోస్ట్‌లో సౌరభ్‌ శర్మ రాశాడు. ధర మాత్రమే కాదు, EMI ఆప్షన్లలో వ్యత్యాసాన్ని కూడా హైలైట్ చేశాడు. ఆ సూట్‌కేస్‌ కొన్న ఆండ్రాయిడ్ వినియోగదార్లు నెలకు రూ. 1,373 నుంచి నో-కాస్ట్ EMIని ఎంచుకోవచ్చు. ఐఫోన్ వినియోగదార్లు కనిష్టంగా రూ. 1,600 EMIని ఎంచుకోవాలని ఆ ఫోటోలను బట్టి అర్ధమవుతుంది.






సౌరభ్‌ శర్మ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది, 1,37,000 వ్యూస్‌ సంపాదించుకుంది. దీంతో, ఫ్లిప్‌కార్ట్‌ ధరల విధాన గురించి చర్చ ప్రారంభమైంది.


ఫ్లిప్‌కార్ట్‌ స్పందన
సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సౌరభ్‌ శర్మ పోస్ట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్ సర్వీస్‌ విభాగం స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. వస్తువుల ధరలను అమ్మకందార్లు (sellers) నిర్ణయిస్తారని, అనేక కారణాల వల్ల ధరలు మారవచ్చని ఆ ప్రకటనలో వివరించింది. అంతేకాదు, ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లు కంగారు పడొద్దని కూడా సూచించింది. తమ ఫ్లాట్‌ఫామ్‌లోని సెల్లర్స్‌ గొప్ప డీల్స్‌, డిస్కౌంట్‌లు అందించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తున్నారని చెప్పింది. చివరిగా "హ్యాపీ షాపింగ్!" అంటూ ముక్తాయించింది. అంటే, ధరల్లో వ్యత్యాసాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ షాపింగ్ కొనసాగించమని వినియోగదార్లను కోరింది ఫ్లిప్‌కార్ట్‌.


ఫ్లిప్‌కార్ట్‌ వివరణపైనా ఆన్‌లైన్‌లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది వినియోగదార్లు ఫ్లిప్‌కార్ట్‌ను సమర్థిస్తే... మరికొందరు ధరల అసమానతలపై విచారం వ్యక్తం చేశారు. యాప్-ఆధారిత కమీషన్ల వల్ల రేట్లలో మార్పు ఉండొచ్చని మరికొందరు ఊహించారు. చాలామంది.. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఉత్పత్తుల్లో రేట్ల వ్యత్యాసాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఓ వ్యక్తి, ఈ-కామర్స్‌లోనే కాదు క్యాబ్‌ బుక్‌ చేసినా కూడా ఇలాంటి తేడా ఉంటుందని కామెంట్‌ చేశాడు.


మరో ఆసక్తికర కథనం: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!