Digital Life Certificate: పెన్షనర్‌లు, నెలనెలా పెన్షన్‌ పొందేందుకు తాము జీవించే ఉన్నామని నిరూపించుకోవాలి. ఇందుకోసం, 'లైఫ్ సర్టిఫికేట్‌'ను (జీవన్‌ ప్రమాణ్‌  పత్రం/ జీవిత ధృవీకరణ పత్రం) సమర్పించాలి. ఏటా నవంబర్‌ నెలలో జీవిత ధృవీకరణ పత్రాన్ని పింఛనుదార్లు సబ్మిట్‌ చేయాలి. లేకపోతే పెన్షన్‌ ఆగిపోతుంది. నవంబర్‌ నెల ప్రారంభం కావడంతో, ప్రభుత్వ & ప్రైవేట్ సంస్థల్లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియ ఫుల్‌ స్వింగ్‌లో కొనసాగుతోంది. 


లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్ ద్వారా గానీ, ఆఫ్‌లైన్‌ ద్వారా (స్వయంగా వెళ్లి) గానీ సమర్పించొచ్చు. జీవన్‌ ప్రమాణ్‌ పత్రాన్ని ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో సబ్మిట్‌ చేసే పద్ధతులు, షరతుల గురించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం. మీ ఇంట్లో గానీ, మీకు తెలిసిన పెన్షనర్లు ఉంతే, వారికి ఈ సమాచారాన్ని మీరే వివరంగా చెప్పొచ్చు.


వయస్సును బట్టి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే తేదీల్లో మార్పు‌
80 ఏళ్ల లోపు పింఛనుదార్లు నవంబర్ 01 నుంచి 30వ తేదీ లోపు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవచ్చు. సూపర్ సీనియర్ సిటిజన్లు, అంటే 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని అక్టోబర్ 01 నుంచి నవంబర్ 30వ తేదీ మధ్య సబ్మిట్‌ చేయొచ్చు. సీనియర్‌ సిటిజెన్‌ పెన్షనర్లతో పోలిస్తే సూపర్‌ సీనియర్‌ సిటిజెన్‌ పెన్షనర్లకు అదనంగా ఒక నెల సమయం లభిస్తుంది.


లైఫ్ సర్టిఫికేట్ ఎలా ప్రామాణీకరించాలి?
పింఛనుదార్లు, తమ జీవించే ఉన్నామని రుజువు చేసేందుకు ఆధార్ ఫేస్‌ఆర్‌డీ (AADFaceRD) యాప్‌ను ఉపయోగించొచ్చు. ఈ యాప్‌లో.. ముఖం, వేలిముద్ర, ఐరిస్ గుర్తింపు వంటివాటిని ఉపయోగించి తమ జీవిత గుర్తింపును ప్రామాణీకరించవచ్చు.


ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ ఎలా రూపొందించాలి?
ఈ కింది పద్ధతులను ఉపయోగించి, పెన్షనర్లు & కుటుంబ పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని ఇంట్లో కూర్చునే, ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు.


-- మొదట, మీకు పెన్షన్‌ ఇచ్చే బ్యాంక్/పోస్టాఫీస్‌ పెన్షన్ పంపిణీ అధికారి దగ్గర మీ ఆధార్ నంబర్ అప్‌డేట్ అయిందో, లేదో నిర్ధరించుకోండి.
-- గూగుల్‌ ప్లే స్టోర్‌ (Google Play Store) నుంచి 'AADFaceRD', 'జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్'ను (Jeevan Pramaan Face App) మీ స్మార్ట్‌ఫోన్‌లోకి ఇన్‌స్టాల్ చేయండి.
-- యాప్‌లో పెన్షనర్ గురించిన సమాచారాన్ని పూరించండి.
-- పెన్షనర్‌ ఫోటో తీసి ఆ సమాచారాన్ని సమర్పించండి.
-- లైఫ్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక లింక్‌తో SMS వస్తుంది.
-- ఆ లింక్‌ మీద క్లిక్‌ చేస్తే డిజిటల్‌ లైఫ్ సర్టిఫికేట్ జెనరేట్‌ అవుతుంది. దానిని డౌన్‌లోడ్‌ చేసుకోండి.


లైఫ్ సర్టిఫికేట్ ఆఫ్‌లైన్‌లో ఎలా సమర్పించాలి?
లైఫ్ సర్టిఫికేట్‌ను నేరుగా మీ బ్యాంక్‌/ పోస్టాఫీస్‌ లేదా నిర్దిష్ట ప్రదేశాల్లో సమర్పించాలి.


లైఫ్ సర్టిఫికేట్‌ను ఎక్కడ డిపాజిట్ చేయవచ్చు?
-- జీవన్ ప్రమాణ్ పోర్టల్
-- డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (DSB) ఏజెంట్
-- పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ పరికరాల ద్వారా
-- బ్యాంక్ బ్రాంచ్‌లో ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ ఫారం ద్వారా


గడువు తేదీలోగా లైఫ్ సర్టిఫికేట్‌ సమర్పించపోతే ఏం జరుగుతుంది?
చివరి తేదీలోగా పింఛనుదార్లు తమ జీవిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించలేకపోతే, ఆ తర్వాతి నెల నుంచి పింఛను రాదు. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాతే పెన్షన్ చెల్లింపు పునఃప్రారంభమవుతుంది.


మరో ఆసక్తికర కథనం: ఫ్లెక్సీ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ Vs పర్సనల్ లోన్ - ఏ అవసరానికి ఏది ఉత్తమం?