AP Police Registered Case YSRCP Supporters Against Social Media obscene posts: సోషల్ మీడియాలో పోస్టులు శ్రుతి మించిపోతున్నాయని పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. వివిధ వర్గాల నుంచి అందుతున్న ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్కరోజే భారీగా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీనిపై వైసీపీ మండిపడుతోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోంది మంచిది కాదంటూ ప్రభుత్వానికి జగన్ వార్నింగ్ ఇచ్చారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైసీపీ మద్దతు దారులు పెట్టిన పోస్టులు వివాదాస్పదమవుతున్నాయి. ఇవి ప్రత్యర్థులను కించపరిచేలా ఉంటున్నాయని విమర్శలు చేస్తే సమాధానం చెబుతామని అంటున్నారు కూటమి మద్దతుదారులు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా కూటమి నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు, మద్దతుదారులు పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో లోపాలు ఎత్తి చూపుతూ కొన్ని పోస్టులు ఉంటున్నాయి. వాటికి అటు నుంచి అదే స్థాయిలో సమాధానం వస్తోంది. అయితే మరికొందరు మాత్రం కూటమి నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనితను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఎఫ్ రెడ్డి, ఏకే ఫ్యాన్ ఎట్ జగన్‌మామ92, దర్శన్ ఎట్ దూరదర్శన్ 619 వంటి ఎక్స్ హ్యాండిల్స్ నుంచి అసభ్యకరమైన పోస్టులు వస్తున్నాయి. వీటిని సాక్ష్యంగా చూపిస్తూ వివిధ పోలీస్ స్టేషన్లలో జనసేన, టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేశారు. వీటి ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక్క విజయవాడ పరిధిలోనే 40కిపైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ హ్యాండిల్స్ నుంచి వచ్చిన పోస్టులు వివిధ వర్గాలను, రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ పోలీసులు ఎఫ్‌ఐర్‌లు రిజిస్టర్ చేశారు.
గతంలో కూడా వైసీపీ నేతలు కొందరు టీడీపీ, జనసేన నేతలపై అసభ్యపదజాలంతో తిడుతూ పోస్టులు పెట్టారని వాటిపై కూడా కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. వాటిని కూడా పోలీసులు పరిశీలించారు. ఇప్పటికీ ఆ పోస్టులు సోషల్ మీడియాలో ఉన్నందున వాటిని పోస్టు చేసిన వారిపై కూడా కేసులు రిజిస్టర్ చేశారు.
జగన్ వార్నింగ్
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెట్టడాన్ని వైసీపీ అధినేత జగన్ తీవ్రంగా ఖండించారు. కూటమి నేతల ఒత్తిడితోనే వైసీపీ మద్దతుదారులు, నేతలపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటివి ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జగన్ హెచ్చరించారు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ కేసులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
గతాన్ని గుర్తు చేస్తున్న టీడీపీ మద్దతుదారులు
జగన్ వార్నింగ్‌పై టీడీపీ మద్దతుదారులు ఫైర్ అవుతున్నారు. గతాన్ని మర్చిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే అర్థరాత్రి వచ్చి అరెస్టు చేసిన ఘటనలు మర్చిపోయారా అంటూ గుర్తు చేస్తున్నారు. ఇళ్లపైకి సీఐడీ అధికారులను పంపించిన సంగతి గుర్తు తెచ్చుకోవాలని ఆయన్ని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. నాడు టీడీపీ నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా పట్టించుకోలేదని ఇప్పుడు వాటిపైనే కేసులు రిజిస్టర్ అవుతున్నాయని వివరిస్తున్నారు.