Utkarsh Finance Bank: 


ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్ లిస్టింగ్‌ అదిరింది! ఇష్యూ ధరతో పోలిస్తే కంపెనీ షేర్లు ఏకంగా 60 శాతం ప్రీమియంతో లిస్ట్‌ అయ్యాయి. మార్కెట్‌ పరిస్థితులు అనకూలంగా ఉండటం, బెంచ్‌ మార్క్‌ సూచీలు గరిష్ఠ స్థాయిలకు చేరుకోవడం, ఐపీవోను ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడం వంటివి ఇందుకు దోహదం చేశాయి.


బ్యాంకు ఒక్కో షేరును రూ.25కు ఇష్యూ చేయగా రూ.40 వద్ద నమోదు అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏకంగా రూ.48 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఏడాది ఐడియా ఫోర్జ్‌ తర్వాత ఎక్కువ మంది సబ్‌స్క్రైబ్‌ చేసుకున్న రెండో ఐపీవో ఉత్కర్ష్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుదే.


ఏకంగా 101.91 రెట్ల మంది బిడ్లు వేశారు. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయర్లు 124.85 రెట్లు సబ్‌స్క్రైబ్‌ చేసుకున్నారు. అధిక నెట్‌వర్త్‌ సంపన్నులు 81.64 రెట్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లు 72.11 రెట్లు దరఖాస్తు చేశారు. బ్యాంకు ఉద్యోగులు సైతం షేర్ల కోసం విపరీతంగా పోటీ పడ్డారు. కేటాయించిన కోటా కన్నా 16.58 రెట్లు ఎక్కువగా బిడ్లు వేశారు.


ఆకర్షణీయమైన వాల్యుయేషన్లు, ఆరోగ్యకరమైన ఫైనాన్షియల్స్‌, మెరుగైన అసెట్‌ క్వాలిటీ, మైక్రో బ్యాంకింగ్‌ సెగ్మెంట్లో సురక్షితం కాని రుణాల తగ్గింపు వంటివి ఇన్వెస్టర్లను ఆకర్షించాయి. వారణాసి కేంద్రంగా పనిచేస్తున్న ఉత్కర్ష స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఈ ఐపీవో ద్వారా రూ.500 కోట్లు సమీకరించింది. భవిష్యత్తు పెట్టుబడి అవసరాలు, టైర్‌-1 క్యాపిటల్‌ బేస్‌ కోసం వీటిని వినియోగిస్తారు. ఇష్యూ ధరల శ్రేణి రూ.23-25 కావడంతో బ్రోకరేజీ కంపెనీలు చాలా వరకు సబ్‌స్క్రైబ్‌ రేటింగ్‌ ఇచ్చాయి.


స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకింగ్‌ రంగంలో ఉత్కర్ష బ్యాంకు వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2018-23 మధ్య స్థూల రుణాల పోర్టుఫోలియో 34 శాతం వృద్ధిరేటుతో రూ.13,957 కోట్లుగా ఉంది. మొత్తం డిపాజిట్లు 44 శాతం పెరిగి రూ.13,710 కోట్లకు  చేరుకున్నాయి. బ్యాంకు శాఖలు, ఔట్‌ లెట్లు పెంచడం, వైవిధ్యమైన ఆర్థిక సాధనాల వంటివి ఇందుకు దోహదం చేశాయి.


ఇక 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు లాభం 558 శాతం పెరిగి రూ.405 కోట్లకు పెరిగింది. ఆదాయం 44 శాతం పెరిగి రూ.1,529 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్‌ 8.8 శాతం నుంచి 9.6 శాతానికి ఎగిసింది. స్థూల నిరర్థక ఆస్తులు 3.2 శాతం, నికర నిరర్థక ఆస్తులు 0.4 శాతానికి తగ్గాయి.


Also Read: ఇన్ఫీ నికర లాభంలో 11% గ్రోత్‌! రెవెన్యూ గైడెన్స్‌లో కోత - మళ్లీ నిరాశే!!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial