Uniparts India IPO Listing: ఇంజినీర్డ్ సిస్టమ్స్, సొల్యూషన్స్‌ను అందించే యూనిపార్ట్స్ ఇండియా లిమిడెడ్ షేర్లు ఇన్వెస్టర్లను తీవ్రంగా నిరాశపరిచాయి. ఇవాళ (సోమవారం, 12 డిసెంబర్ 2022) దలాల్ స్ట్రీట్ అరంగేట్రం చేసిన కంపెనీ స్టాక్ ఫ్లాట్‌గా లిస్టయింది. IPo సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో, ఈ షేర్లు డిస్కౌంట్‌లో లిస్ట్ కావచ్చని ముందు నుంచీ మార్కెట్ వర్గాలు ఊహిస్తున్నాయి.
IPO ఇష్యూ ప్రైస్ రూ. 577తో పోలిస్తే... బాంబే స్టాక్ ఎక్సేంజ్ BSEలో రూ. 575 వద్ద 0.35% డిస్కౌంట్‌లో ఒక్కో షేరు ఓపెన్ అయింది. రూ. 4.65 కోట్ల విలువైన 81 వేల షేర్లు మాత్రమే ఓపెనింగ్ టైమ్‌లో చేతులు మారాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ NSEలోనూ ఒక్కో షేరు రూ. 575 వద్ద ప్రారంభమైంది. ఆ సమయంలో, రూ. 44.64 కోట్ల విలువైన 7.76 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఈ ఏడాది నవంబర్ 30 - డిసెంబర్ 2 తేదీల్లో యూనిపార్ట్స్ ఇండియా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కొనసాగింది. రూ. 548- 577 రేంజ్‌లో ఒక్కో షేరును విక్రయించి, దాదాపు రూ. 835.6 కోట్లను ఈ కంపెనీ సమీకరించింది.
ఈ ఇష్యూ మొత్తం 25.3 రెట్లకు పైగా సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ల (QIBలు) క్యాటగిరీ 67.14 రెట్లు - నాన్- ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NIIలు) కోటా 17.86 రెట్లు - రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (RIIలు) వాటా 4.61 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది.
మూడో ప్రయత్నం
యూనిపార్ట్స్ ఇండియా మార్కెట్ విలువ రూ. 2,595 కోట్లు. పబ్లిక్‌లోకి వెళ్లడానికి కంపెనీకి చేసిన మూడో ప్రయత్నం ఇది. ఇంతకుముందు, సెప్టెంబర్ 2014లో మొదటిసారి, డిసెంబర్ 2018లో రెండోసారి సెబీకి IPO పత్రాలను దాఖలు చేసింది. ఈ రెండు సందర్భాలలో IPOని ప్రారంభించేందుకు రెగ్యులేటర్ అనుమతి కూడా వచ్చింది. అయితే, కొన్ని కారణాల వల్ల IPOకు రాకుండా ఆగిపోయింది. ముచ్చటగా మూడోసారి షేర్లను విక్రయానికి తీసుకొచ్చింది.
ఈ IPO కంప్లీట్‌గా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూట్‌లో వచ్చింది. అంటే, కంపెనీ ఒక్క కొత్త షేరును కూడా జారీ చేయలేదు. ప్రమోటర్ గ్రూప్ సంస్థలు, ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు 14,481,942 ఈక్విటీ షేర్లను అమ్మారు. IPO ద్వారా వచ్చిన డబ్బు మొత్తం వీళ్ల జేబుల్లోకి వెళ్తుంది తప్ప, కంపెనీ ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా జమ కాదు.
OFSలో షేర్లను ఆఫర్ చేసిన ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీలు... ది కరణ్ సోనీ 2018 CG-NG నెవాడా ట్రస్ట్, ది మెహెర్ సోనీ 2018 CG-NG నెవాడా ట్రస్ట్, పమేలా సోనీ. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు... అశోకా ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్, అంబాదేవి మారిషస్ హోల్డింగ్ లిమిటెడ్.
ఇంజినీరింగ్ సిస్టమ్స్, సొల్యూషన్స్‌ను రూపొందించి, గ్లోబల్‌గా మార్కెట్ చేసే కంపెనీ ఇది. అగ్రికల్చర్, కన్‌స్ట్రక్షన్, ఫారెస్ట్రీ, మైనింగ్ రంగాల్లో ఆఫ్-హైవే మార్కెట్ కోసం సిస్టమ్స్, కాంపోనెంట్లను యూనిపార్ట్స్ ఇండియా సరఫరా చేస్తుంది. 25 దేశాల్లో దీనికి క్లయింట్స్ ఉన్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.