Tata's Bigbasket IPO:


దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ గ్రాసరీ కంపెనీ బిగ్‌ బాస్కెట్‌ ఐపీవో బాట పట్టనుంది. రెండు నుంచి మూడేళ్లలోపు పబ్లిక్ ఇష్యూకు వస్తామని వెల్లడించింది. 3.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ కంపెనీ ఈ మధ్యే నిధులు సేకరించింది.


బెంగళూరు కేంద్రంగా వ్యాపారం మొదలుపెట్టిన బిగ్‌బాస్కెట్‌ దేశ వ్యాప్తంగా సేవలను విస్తరించాలని భావిస్తోంది. కంపెనీ విస్తరణ కోసం తొలుత ప్రైవేటు పెట్టుబడులు స్వీకరించేందుకు మొగ్గు చూపుతోంది. ఆ తర్వాత 24 నుంచి 36 నెలల మధ్యన ఐపీవోకు వచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్‌ ఆఫీసర్ విపుల్‌ పారేఖ్‌ అన్నారు.


వారం రోజుల క్రితమే బిగ్‌బాస్కెట్‌ 200 మిలియన్‌ డాలర్ల నిధులు సేకరించింది. వేగంగా సరుకులు డెలివరీ చేయడం, దేశవ్యాప్తంగా సేవలు విస్తరించేందుకు వీటిని ఉపయోగించుకోనుంది. ఈ-కామర్స్‌ రంగంలో పాతుకు పోయిన అమెజాన్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు పోటీనివ్వాలని భావిస్తోంది.


Also Read: కష్టాల మార్కెట్‌లోనూ కాసులు కురిపించిన ల్యాబ్‌ స్టాక్స్‌, చైనాలో కరోనా కేసులే కారణం


Also Read: ఈఎంఐ టెన్షన్‌కు గుడ్‌బై! ఈ చిన్న ట్రిక్‌తో వడ్డీలేకుండా ఇంటిని కొనుక్కోవచ్చు!


కొత్త సేకరించిన నిధులను క్యాపిటల్‌ ఎక్స్‌పాన్షన్‌, కొత్త ప్రాంతాల్లో మార్కెటింగ్‌ కోసం సమానంగా ఉపయోగిస్తామని పారేఖ్‌ తెలిపారు. బీబీ నౌకు సరఫరా చేస్తున్న డార్క్‌ స్టోర్లను పెంచుతామని పేర్కొన్నారు. బీబీ నౌ ప్రస్తుతం 30 నిమిషాల్లోనే సరకులు డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మార్చి కల్లా ఈ స్టోర్లను 200 నుంచి 300 పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 55 నగరాల్లో బిగ్‌బాస్కెట్‌ సేవలు అందిస్తోంది. ఇదే సమయంలో 75 నగరాలకు విస్తరించాలని కోరుకుంటోంది. 450 పట్టణాల్లోనూ బిగ్‌బాస్కెట్‌ ఉనికి ఉంది. వచ్చే ఏడాదికి మరో 80-100 వరకు పెంచనుంది.