Aadhar Housing Finance IPO: ఒక భారీ ఆఫర్‌ ప్రైమరీ మార్కెట్‌ తలుపు తట్టేందుకు సిద్ధమవుతోంది. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌ ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (IPO), మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ నుంచి ఆమోదం లభించింది. అఫర్డబుల్ హౌసింగ్ విభాగంలో పని చేస్తున్న ఈ హోమ్ ఫైనాన్స్ కంపెనీకి ఐపీవో మార్కెట్‌ తలుపులు తెరుచుకున్నాయి. ఈ కంపెనీ, తన IPO పత్రాలను ఈ నెల 02న సెబీకి సమర్పించింది. 


ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌ ఐపీవో సైజ్‌ రూ. 5000 కోట్లు. ఈ కంపెనీకి బ్లాక్‌స్టోన్ వంటి ప్రపంచ స్థాయి కంపెనీ మద్దతు ఉంది. అంటే, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్‌లో బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులు కూడా ఉన్నాయి.


వాటా విక్రయించనున్న బ్లాక్‌స్టోన్
మనీకంట్రోల్ రిపోర్ట్‌ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్‌ ఆఫర్‌ (IPO) ప్రారంభం అవుతుంది. నివేదిక ప్రకారం, హోమ్ ఫైనాన్స్ కంపెనీ ఈ IPO ద్వారా సుమారు రూ. 1000 కోట్ల విలువైన తాజా షేర్లను అమ్మకానికి పెడుతుంది. దీంతోపాటు దాదాపు రూ. 4000 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్‌ను (OFS) కూడా ప్రకటిస్తుంది. ప్రమోటర్‌ సహా ఇప్పటికే ఉన్న వాటాదార్లు OFS ద్వారా తమ వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించవచ్చు. బ్లాక్‌స్టోన్ తన వాటాను OFS రూట్‌లో విక్రయించనుంది. 


IPO ద్వారా వచ్చిన డబ్బుతో కంపెనీ భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చుకోవాలని ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ భావిస్తోంది. ICICI సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, నోమురా, సిటీ, SBI క్యాపిటల్‌ ఈ ఐపీవోకు సలహాదార్లుగా వ్యవహరిస్తున్నాయి.


2022 మే నెలలోనూ IPO ప్రయత్నం
ఇంతకుముందు, ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 2021 జనవరిలో IPO పత్రాలను దాఖలు చేసింది. IPOను ప్రారంభించేందుకు 2022 మే నెలలో ఈ  కంపెనీ ఆమోదం పొందింది. అయితే, కంపెనీ ఒక సంవత్సరం పాటు IPO ప్రారంభించలేదు. ఆ కారణంగా, సెబీ ఆమోదం చెల్లుబాటు గడువు ముగిసింది. ఆ తర్వాత కంపెనీ మళ్లీ ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించాల్సి వచ్చింది. ఇటీవల భారత్‌లో పర్యటించిన బ్లాక్‌స్టోన్ ప్రెసిడెంట్ & COO జోనాథన్ గ్రే, ఈ కంపెనీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని చెప్పారు. భవిష్యత్తులో సంస్థ మౌలిక సదుపాయాలు, ఈక్విటీ, ప్రైవేట్ క్రెడిట్ రంగాల్లోకి కూడా ప్రవేశించవచ్చని హింట్‌ ఇచ్చారు.


భారీ IPOకు సిద్ధమవుతున్న బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్
హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో మరో పెద్ద కంపెనీ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా IPO సన్నాహాల్లో బిజీగా ఉంది. బజాజ్ ఫైనాన్స్ అనుబంధ కంపెనీ మార్కెట్లో సుమారు రూ. 8000 కోట్ల విలువైన IPOని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. అయితే, ఆర్‌బీఐ నిబంధనల మేరకు ఈ ఐపీఓను ప్రారంభించాల్సి ఉంటుంది.


హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో, 2023 డిసెంబర్‌లో, ఇండియా షెల్టర్ ఫైనాన్స్ రూ.1200 కోట్ల IPOతో స్టాక్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: 19 ఏళ్లకే వేల కోట్ల ఆస్తి, ఈ అమ్మాయి ప్రపంచంలోనే యువ బిలియనీర్‌