NTPC Green Energy IPO: షేర్ మార్కెట్‌లో డబ్బు సంపాదించే అవకాశాల కోసం వెతుకుతున్న పెట్టుబడిదార్లకు, ప్రభుత్వ రంగ సంస్థ NTPC (National Thermal Power Corporation) ఒక శుభవార్త చెప్పబోతోంది. భారతదేశపు అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ, త్వరలోనే IPO మార్కెట్‌లో సందడి చేయవచ్చు. తన గ్రీన్ ఎనర్జీ యూనిట్ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ను (NGEL) పబ్లిక్‌లోకి తీసుకొచ్చేందుకు ఎన్‌టీపీసీ ప్రయత్నాలు చేస్తోంది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే..
NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ (NTPC Green Energy Ltd), ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే IPO మార్కెట్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.


NTPC, నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో, మలేషియాకు చెందిన పెట్రోలియం నేషనల్ బెర్హాద్ (Petronas) ప్రతిపాదనపై ఇది ఆశలు పెట్టుకుంది, ఆ ప్లాన్‌ ప్రస్తుతం అటకెక్కింది. ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో 20 శాతం వాటాను కొనుగోలు చేయడానికి పెట్రోనాస్‌ అప్పట్లో ఆసక్తి ప్రదర్శించింది. 20 శాతం వాటాను కొనుగోలు కోసం దాదాపు రూ. 4,000 కోట్లతో భారీ స్థాయి ఆఫర్‌ను అందించింది. గతంలో.. REC లిమిటెడ్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్‌కు పెట్రోనాస్‌ ఇచ్చిన ఆఫర్‌ల కంటే, NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు ఇచ్చిన ఆఫర్‌ మొత్తం చాలా ఎక్కువగా ఉంది. 


పెట్రోనాస్‌ నో చెప్పడంతో ఇప్పుడు IPO ప్లాన్‌
అయితే, కొన్ని కారణాల వల్ల వాటా కొనుగోలు ప్రతిపాదన నుంచి పెట్రోలియం నేషనల్ బర్హాద్ వైదొలిగింది. దీంతో, NTPCకి నిధుల సేకరణ కథ మళ్లీ మొదటికి వచ్చింది. అందువల్లే, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ను IPOకు తీసుకురావడం ద్వారా డబ్బు సేకరించడానికి NTPC ప్రయత్నాలు చేస్తున్నట్లు మార్కెట్‌ వర్గాల భోగట్టా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 6,000 కోట్లు సమీకరించాలని ఎన్‌టీపీసీ యోచిస్తోంది. ఇందుకోసం వాటా విక్రయం సహా అన్ని ఆప్షన్లను పరిశీలిస్తోంది. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ IPO కూడా ఈ ఎంపికల్లో ఒకటిగా ఉంది.


పెరుగుతున్న NTPC గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యం
NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గురించి మాట్లాడుకుంటే... ఈ ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ, NTPC క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తోంది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, NTPCకి చెందిన దాదాపు 15 పునరుత్పాదక ఇంధన ఆస్తులు NGELకి బదిలీ చేశారు.


ప్రస్తుతం, భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్‌లో దాదాపు 24% వాటాను NTPC అందిస్తోంది. 2032 నాటికి, 60 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని స్వతంత్ర ప్రాతిపదికన, 130 గిగావాట్లను ఏకీకృత ప్రాతిపదికన సృష్టించాలన్నది NTPC ప్లాన్‌. అణుశక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఈ-మొబిలిటీ, వ్యర్థాల నుంచి సంపద సృష్టి ప్రాజెక్టులపై కూడా కంపెనీ పనిచేస్తోంది. 2030 నాటికి GDP ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడానికి తగ్గట్లుగా భారత ప్రభుత్వం పని చేస్తోంది. అదే కాలానికి, దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్‌లో 50 శాతాన్ని శిలాజయేతర ఇంధన (non-fossil fuel) వనరుల నుంచి సాధించేలా విద్యుత్ శక్తి సామర్థ్యాన్ని పెంచుతోంది. 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజయేతర ఇంధన ఆధారిత సామర్థ్యాన్ని కలిగి ఉండాలని కూడా యోచిస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.