Income Tax On Sovereign Gold Bonds Income: పెట్టుబడి వర్గంలో, ముఖ్యంగా బంగారంలో చేసే మదుపు కేటగిరీల్లో సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు (SGBs) ప్రజాదరణ ఉంది. ఎస్‌జీబీ పెట్టుబడుల్లో చాలా విషయాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది పెట్టుబడికి భద్రత (Security of investment) + రాబడికి హామీ (Guaranteed return). సావరిన్ గోల్డ్ బాండ్స్‌కు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ (RBI) జారీ చేస్తుంది. కాబట్టి, తమ డబ్బుకు ఎలాంటి ప్రమాదం ఉండదన్న భరోసా పెట్టుబడిదార్లకు కలుగుతుంది.
సంపాదన పరంగానూ సావరిన్ గోల్డ్ బాండ్స్ మెరుగ్గా ఉన్నాయని చాలా సందర్భాల్లో రుజువైంది. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (Fixed Deposits/FDs) వంటి అనేక ఇతర ఇన్వెస్ట్‌మెంట్ క్లాస్‌లను (Investment Class) ఎస్‌జీబీలు అధిగమించాయి. SGBల్లో పెట్టుబడి పెట్టిన వాళ్లు... బంగారం ధర పెరగడం వల్ల వచ్చే ప్రయోజనం పొందడమే కాకుండా, పెట్టుబడి మొత్తంపై 2.5% వడ్డీ ఆదాయం (Interest Rate On SGBs) కూడా పొందుతారు. ఈ విధంగా చూస్తే, సావరిన్ గోల్డ్ బాండ్ తన పెట్టుబడిదార్లకు రెండు రకాల ఆదాయాన్ని అందించే డీల్‌గా కనిపిస్తుంది.
వడ్డీ ఆదాయంపై పన్ను
అయితే, SGBల ద్వారా సంపాదించే ఆదాయం పూర్తిగా పన్ను రహితం కాదు. సావరిన్ గోల్డ్ బాండ్‌పై వచ్చే 2.5 శాతం వడ్డీ ఆదాయంపై ఆదాయ పన్ను (Income Tax) చెల్లించాలి. SGBలపై వచ్చే వడ్డీ ఆదాయం, పెట్టుబడిదారు ప్రాథమిక ఆదాయానికి యాడ్ అవుతుంది. ITR ఫైల్ చేసే సమయంలో, మొత్తం ఆదాయంపై వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం పన్ను కట్టాలి.
స్వల్ప/దీర్ఘకాల మూలధన లాభాల పన్ను
పెట్టుబడిదారు SGBలను రిడీమ్ చేసినప్పుడు రెండు రకాల ఆదాయం వస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ అమ్మకంపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. హోల్డింగ్ పీరియడ్‌పై ఆధారపడి, అంటే మీరు ఎంతకాలం గోల్డ్ బాండ్‌ని మీ వద్ద ఉంచుకున్నారు అన్నదానిపై ఆధారపడి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (short term capital gains tax) లేదా దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (long term capital gains tax) వర్తిస్తుంది.
SGBల్లో, కొన్న తేదీ నుంచి 1 సంవత్సరం లోపు వరకే దానిని హోల్డ్ చేస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను వర్తిస్తుంది. ఒక సంవత్సరం దాటిన తర్వాత రిడీమ్ చేస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి.
పన్ను వర్తించని సందర్భం
మెచ్యూరిటీ తేదీ వరకు సావరిన్ గోల్డ్ బాండ్‌ను మీ వద్దే ఉంచుకుంటే ఆదాయ పన్ను వర్తించదు (Tax-free). సావరిన్ గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ పిరియడ్ 8 సంవత్సరాలు. మీరు ఈ 8 సంవత్సరాల పాటు బాండ్స్‌ను హోల్డ్ చేస్తే ఆదాయపు పన్ను బాధ్యత (Income tax liability) ఉండదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: బీపీ పెంచుతున్న గోల్డ్, సిల్వర్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి