Infosys: 


ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ (Infosys) అరుదైన ఘనత సాధించింది. 2023లో ప్రపంచంలోని అత్యుత్తమ 100 కంపెనీల జాబితాలో నిలిచిన ఏకైక కంపెనీగా అవతరించింది. టైమ్‌ మేగజిన్‌, స్టాటిస్టా సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి.


ఈ జాబితాలో ఇన్ఫోసిస్‌కు 64వ స్థానం దక్కింది. టెక్‌ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, ఆల్ఫాబెట్‌, మెటా అగ్రస్థానంలో నిలిచాయి. ఈ ప్రపంచాన్ని మారుస్తున్న, ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న 750 కంపెనీలతో టైమ్స్‌, స్టాటిస్టా ఈ జాబితాను రూపొందించాయి. ఆదాయ వృద్ధి, ఉద్యోగుల సంతృప్తి, వాతావరణ, సామాజిక, కార్పొరేట్‌ పాలన వంటి సమాచారం ఆధారంగా కంపెనీలను ఎంపిక చేశాయి.


ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తయారీ, కన్జూమర్‌ గూడ్స్‌ కంపెనీలు శాసించాయి. ఇప్పుడా స్థానాన్ని ఫాస్ట్‌ మూవింగ్‌ టెక్‌ కంపెనీలు, బిజినెస్‌ సర్వీసుల కంపెనీలు ఆక్రమించాయని ర్యాంకింగ్స్‌ ద్వారా తెలుస్తోంది. 'టెక్‌ కంపెనీలు అత్యుత్తమంగా రాణించాయి. ఎయిర్‌లైన్స్‌, హోటళ్లు, తయారీ కంపెనీలతో పోలిస్తే టెక్‌ కంపెనీలు అతి తక్కువగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి' అని టైమ్‌ తెలిపింది.


'ఉద్యోగులు సైతం టెక్‌ కంపెనీల పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు. టాప్‌ - 4లో నిలిచిన కంపెనీల ఉద్యోగులు అత్యంత సంతోషంగా ఉన్నారు. చివరి మూడేళ్లలో కర్బన ఉద్గారాలను తగ్గించడం, బోర్డులోకి ఎక్కువ మహిళలకు చోటివ్వడంతో పాటు వారు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందారు' అని టైమ్‌ వెల్లడించింది.


ఇన్ఫోసిస్‌ను పక్కన పెడితే భారత్‌ నుంచి ఏడు కంపెనీలు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. విప్రో 174, మహీంద్రా గ్రూప్‌ 210, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 248, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ 262, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 418, WNS గ్లోబల్‌ సర్వీసెస్‌ 596, ఐటీసీ లిమిటెడ్‌ 672 స్థానాల్లో నిలిచాయి. ఇన్ఫీ మరో ఘనతా అందుకుంది. ప్రపంచంలోని టాప్‌-3 ప్రొఫెషనల్‌ సర్వీసెస్‌ కంపెనీలో ఒకటిగా నిలిచింది.


అక్టోబర్ 12న రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటనతో పాటు మధ్యంతర డివిడెండ్‌ను కూడా పరిశీలిస్తామని ఇన్ఫోసిస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇన్ఫీ షేరు నేడు ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ఉదయం 1510 వద్ద ఆరంభమైన షేరు 1509 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని అందుకుంది. 1518 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం 2 గంటలకు 3 రూపాయాల లాభంతో 1510 వద్ద కొనసాగుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.