Narayana Murthy Gifts Shares Worth Rs 240 Crore To Grandson: ఢిల్లీ: టెక్ దిగ్గజం, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన మనవడికి అతి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. తన మనవడు, రోహన్ మూర్తి కొడుకు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి పేరిట ఏకంగా 15 లక్షల షేర్లను రిజిస్టర్ చేశారు. ఈ షేర్ల విలువ దాదాపు రూ.240 కోట్లు ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే ఏకాగ్రహ్ రోహన్ మూర్తి వయసు కేవలం 4 నెలలు. దాంతో బుల్లి మనవడికి తాత ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారీ గిఫ్ట్ అని హాట్ టాపిక్‌ అయింది. కంపెనీలో మూర్తికి 0.40 శాతం వాటా ఉండగా.. 1.51 కోట్ల ఇన్ఫోసిస్ షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. 


అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్లలో చోటు 
నారాయణ మూర్తి, సుధామూర్తి దంపతులకు సంతానం ఇద్దరు పిల్లలు కాగా, కుమార్తె అక్షతా మూర్తి, కొడుకు రోహన్‌ మూర్తి ఉన్నారు. 2009లో కుమార్తె అక్షతా మూర్తి వివాహం ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో జరిపించారు. అక్షతా, సునాక్ దంపతులకు ఇద్దరు కూమార్తెలు ఉన్నాయి. నారాయణమూర్తి తనయుడు రోహన్ మూర్తికి 2011లో ప్రముఖ వ్యాపారవేత్త వేణు శ్రీనివాసన్‌ కుమార్తె లక్ష్మిని వివాహం చేసుకోగా, అభిప్రాయ భేదాలు రావడంతో 2015లో విడాకులు తీసుకున్నారు. మరో నాలుగేళ్లకు 2019లో రోహన్ మూర్తి, అపర్ణ కృష్ణన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి సంతానం ఏకాగ్రహ్ రోహన్ మూర్తి ఉన్నాడు. 2023 నవంబర్ నెలలో ఏకాగ్రహ్ మూర్తి జన్మించాడు. నాలుగు నెలల వయసున్న ఈ బుజ్జి మనవడికి నారాయణ మూర్తి 15 లక్షల కంపెనీ షేర్లు రాసిచ్చారు. వాటి విలువ రూ.240 కోట్ల మేర ఉండటంతో.. దేశంలో అత్యంత పిన్నవయస్కుడైన మిలియనీర్ల జాబితాలో ఏకాగ్రహ్ మూర్తి నిలిచాడని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


నారాయణమూర్తి 1981లో మరికొందరితో కలిసి ఇన్ఫోసిస్‌ కంపెనీ ప్రారంభించారు. మార్చి 1999లో ఈ కంపెనీ  నాస్‌డాక్‌లో లిస్ట్ అయింది. తద్వారా ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా నిలిచేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఇటీవల ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో నారాయణమూర్తి మాట్లాడుతూ.. ఇన్ఫోసిస్ కంపెనీ నాస్‌డాక్ లిస్టింగ్ కావడం తన జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా పేర్కొన్నారు. నాస్‌డాక్‌లో చోటు దక్కించుకున్న తొలి భారత కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. తాను జీవితంలో ఎన్నో వాయిదా వేసుకున్నా, ఏ విషయంలోనూ పశ్చాత్తాపం చెందలేదన్నారు.