Infosys Kris Gopalakrishnan: టెక్నాలజీతో ఎంత దూసుకుపోతున్నా ఇంకా కులాలు, మతాలు అంటూ ముసుగు వేసుకుని జనాలను చిన్నచూపు చూస్తున్న వాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లు సైతం అలాంటి ప్రవర్తననే కలిగి ఉండడం నిజంగా సిగ్గు చేటు. దానికి ప్రత్యేక నిదర్శనమే తాజాగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం. ఆయనతో పాటు మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాం వంటి మరో 16 మంది పైనా బెంగళూరు (Bengaluru) పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో గిరిజన వర్గానికి చెందిన, ఓ మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ తనను విధుల నుంచి తొలగించారని ఫిర్యాదు చేయడంతో.. తాజాగా ఈ పరిణామం వెలుగులోకి వచ్చింది. వీరంతా కలిసి తనను హనీ ట్రాప్ లో ఇరికించి, తన ఉద్యోగం పోయేలా చేశారని దుర్గప్ప ఫిర్యాదులో తెలియజేశారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిపై కేసు నమోదు
2014 వరకు ఐఐఎస్సీలోని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీలో గిరిజన బోవి కమ్యూనిటీకి చెందిన దుర్గప్ప అనే వ్యక్తి అధ్యాపకుడిగా పని చేసేవారు. ఈ ఏడాదిలోనే తనను హనీ ట్రాప్ కేసులో ఇరికించారని, దీనికి ఇతర ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా సహకరించారని, ఆ తర్వాత విధుల నుంచి తొలగించారని దుర్గప్ప ఆరోపించారు. కులం పేరుతో దూషించారని, బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అలా విమర్శించిన వారిలో క్రిస్ గోపాలకృష్ణణ్ తో పాటు గోవిందన్ రంగరాజన్, శ్రీధర్ వారియర్, సంద్యా విశ్వేశ్వరైహ్, హరి కెవిఎస్, దాసప్ప, బలరామ్ పి, హేమలతా మిషి, ఛటోపాద్యాయ కె, ప్రదీప్ డి సావ్కర్, మనోహరన్ లు కూడా ఉన్నారు. ఈ విషయంపై దుర్గప్ప పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడితో పాటు మరో 17 మంది పైనా 71వ సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ విషయంపై ఐఐఎస్సీ అధ్యాపకుల నుంచి గానీ, క్రిస్ గోపాలకృష్ణన్ నుంచి గానీ ఇంకా ఎలాంటి స్పందనా రాలేదు.
క్రిస్ గోపాలకృష్ణన్ ఎవరంటే..
2011 - 14 వరకు క్రిస్ గోపాలకృష్ణన్ ఇన్ఫోసిస్ వైస్ ఛైర్మన్ గా, 2007 - 11 వరకు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ పని చేశారు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, 2013 -14 సంవత్సరానికి భారత అత్యున్నత పరిశ్రమ ఛాంబర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి అధ్యక్షుడిగా, 2014లో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కో- ఛైర్మన్ లలో ఒకరిగా ఉన్నారు. అంతేకాదు ఆయనను 2011 జనవరిలో కేంద్రం భారత 3వ అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ తో సత్కరించింది. మద్రాస్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ లో గోపాలకృష్ణన్ మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు.
Also Read : Gratuity Calculator: ఎన్ని సంవత్సరాలు పని చేస్తే గ్రాట్యుటీ లభిస్తుంది, కార్మిక చట్టం రూల్స్ ఏంటి?