IIP Data For 2024 February: ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి (Industrial Production) బలంగా పెరిగింది. వార్షిక ప్రాతిపదికన, ఫిబ్రవరిలో పారిశ్రామిక ఉత్పత్తి రేటు 5.7 శాతం పెరిగింది, ఇది గత నాలుగు నెలల్లో అత్యధికం. మైనింగ్ రంగంలో మెరుగైన పనితీరు కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి రేటు ఆకర్షణీయంగా మారింది.


కేంద్ర గణాంకాల కార్యాలయం (NSO) పారిశ్రామిక ఉత్పత్తి డేటాను శుక్రవారం ‍(12 ఏప్రిల్ 2024) విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం... 2024 ఫిబ్రవరిలో దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (Index of Industrial Production) 5.7 శాతం పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో, 2023 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు చూస్తే.. ఈ మధ్యకాలంలో IIP 5.9 శాతం పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ సంఖ్య 5.6 శాతంగా ఉంది. NSO డేటా ప్రకారం, మైనింగ్ ఉత్పత్తి 2024 ఫిబ్రవరి నెలలో 8 శాతం పెరిగింది, ఏడాది క్రితం అదే నెలలో ఇది 4.8 శాతంగా ఉంది.


క్రితం సంవత్సరం ఫిబ్రవరిలో 5.9 శాతంగా ఉన్న తయారీ రంగం ఉత్పత్తి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 5 శాతం పెరిగింది. 2024 ఫిబ్రవరిలో విద్యుత్ ఉత్పత్తి 7.5 శాతం పెరిగింది, ఏడాది క్రితం ఇదే నెలలో ఇది 8.2 శాతం వృద్ధిని సాధించింది. క్యాపిటల్ గూడ్స్ వృద్ధి రేటు ఈ ఏడాది ఫిబ్రవరిలో 1.2 శాతానికి పడిపోయింది, ఏడాది క్రితం ఇదే కాలంలో ఇది 11 శాతంగా ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తి ఇప్పుడు 12.3 శాతం చొప్పున వృద్ధి చెందగా, ఏడాది క్రితం 4.1 శాతం క్షీణించింది. నాన్-డ్యూరబుల్స్ కన్స్యూమర్ గూడ్స్‌ ఉత్పత్తి 3.8 శాతం క్షీణించింది, ఏడాది క్రితం ఇది 12.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. మౌలిక సదుపాయాలు/నిర్మాణ వస్తువులు 2024 ఫిబ్రవరిలో 8.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి, ఏడాది క్రితం ఇదే నెలలో 9 శాతం గ్రోత్‌ సాధించాయి. 


2024 ఫిబ్రవరి నెలలో మైనింగ్, తయారీ, విద్యుత్ రంగాల్లో పెరిగిన ఉత్పత్తి మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేసిందని ఆర్థికవేత్త రజనీ సిన్హా చెప్పారు. గ్రామీణ ప్రాంతాల డిమాండ్‌ కొంత మెరుగుపడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో, రాబోయే రోజుల్లో వినియోగ వస్తువుల విభాగం పనితీరు మెరుగుపడవచ్చని అన్నారు. అలాగే.. తగ్గుతున్న ధరలు, సాధారణ రుతుపవనాలు వినియోగ రంగంలో బలం పెంచుతాయని వివరించారు.


తగ్గిన చిల్లర ద్రవ్యోల్బణం
మన దేశంలో రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌ రేటు 5 శాతం దిగువకు పడిపోయి, ఐదు నెలల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది. NSO డేటా ప్రకారం... 2024 ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం రేటు మార్చి నెలలో 4.85 శాతానికి దిగి వచ్చింది. 2023 అక్టోబర్‌లో ఇది అత్యల్పంగా 4.87 శాతంగా నమోదైంది. ఏడాది క్రితం, 2023 మార్చిలో ద్రవ్యోల్బణం 5.66 శాతంగా నమోదైంది. రిటైల్ ఇన్‌ఫ్లేషన్‌తో రేట్‌తో పాటు మార్చి నెలలో ఫుడ్‌ ఇన్‌ఫ్లేషన్‌ రేట్‌ కూడా కొద్దిగా దిగి వచ్చింది. ఫిబ్రవరి నెలలోని 8.66 శాతంతో పోలిస్తే ఇది మార్చి నెలలో 8.52 శాతానికి తగ్గింది. సరిగ్గా ఏడాది క్రితం, 2023 మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 4.79 శాతంగా ఉంది. 


మరో ఆసక్తికర కథనం: టీసీఎస్ లాభం రూ.12,434 కోట్లు, డివిడెండ్‌ 28 రూపాయలు