TCS Q4 FY24 Results: దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2023-24 మార్చి త్రైమాసికంలో రూ. 12,434 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం, 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 11,392 కోట్ల లాభాన్ని మిగుల్చుకుంది. క్రితం ఏడాదితో పోలిస్తే నెట్ ప్రాఫిట్ ఇప్పుడు 9 శాతం పెరిగింది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ. 45,908 కోట్ల నికర లాభాన్ని ఈ టెక్ దిగ్గజం ఆర్జించింది.
తన వాటాదార్లకు, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ. 28 డివిడెండ్‌ను కూడా టీసీఎస్ ప్రకటించింది.
టీసీఎస్ రికార్డ్ డీల్స్
నాలుగో త్రైమాసికంలో (Q4 FY24 ) కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 3.5 శాతం పెరిగి రూ. 61,327 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది నమోదైన రూ. 59,162 కోట్లతో పోలిస్తే ఇది 3.5 శాతం వృద్ధి.
మార్చి క్వార్టర్‌లో 13.2 బిలియన్ డాలర్ల విలువైన రికార్డ్ స్థాయి ఒప్పందాలను సాధించింది. దీంతో, మొత్తం 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కాంట్రాక్ట్‌ల విలువ 42.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది, ఇది చారిత్రాత్మక గరిష్టం. గతంలో ఎన్నడూ లేనంత ఆర్డర్ బుక్‌ను 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించడం పట్ల ఫలితాలపై మాట్లాడిన TCS MD & CEO K కృతివాసన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 1.50 శాతం పెరిగి 26 శాతానికి చేరిందన్న కృతివాసన్.. తమ బిజినెస్ మోడల్ గురించి చెప్పారు. ఆ మోడల్‌ను అమలు చేయడంలో కంపెనీ సామర్థ్యాన్ని ఆపరేటింగ్ మార్జిన్‌లో వృద్ధి ప్రతిబింబిస్తుందని చెప్పారు.
జీతాలు పెంచిన టీసీఎస్
తన ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు కూడా ఈ టాటా గ్రూప్ కంపెనీ ప్రకటించింది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన వారికి రెండంకెల శాతంలో జీతాలు పెంచారు. నాలుగో త్రైమాసికం ముగింపు నాటికి TCS ఉద్యోగుల సంఖ్య (Work Force) 6,01,546గా ఉందని, అందులో 35.6 శాతం మహిళలని, వర్క్ ఫోర్స్‌లో 152 దేశాలకు చెందినవారు ఉన్నట్లు కంపెనీ చీఫ్ హెచ్‌ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. అయితే.. మార్చి త్రైమాసికంలో టీసీఎస్‌లో ఉద్యోగుల సంఖ్య 1,759 తగ్గింది. మొత్తం FY24లో నికరంగా 13,249 తగ్గింది.
2024 జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అంతకుముందు త్రైమాసికంలో 13.3 శాతంగా ఉన్న ఆట్రిషన్ రేటు (వలసల శాతం), సమీక్ష కాలంలో 12.5 శాతానికి తగ్గింది. అట్రిషన్ రేటు తగ్గడం, క్యాంపస్ నియామకాల్లో బలమైన స్పందన, కస్టమర్ విజిట్స్ పెరగడం, ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం (Back to office) వంటివి డెలివరీ సెంటర్లపై సానుకూల ప్రభావం చూపాయని మిలింద్ లక్కడ్ వెల్లడించారు.
శుక్రవారం (12 ఏప్రిల్ 2024) మార్కెట్ ముగిసిన తర్వాత టీసీఎస్ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల నేపథ్యంలో, శుక్రవారం టీసీఎస్ షేరు 0.45 శాతం లాభంతో 4000.30 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మీరు చూస్తుండగానే పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న 7 రకాల మోసాలు