India Unicorn Companies 2024: ఇండియన్‌ స్టార్టప్‌లకు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకంగా నిలిచింది. 2023 సంవత్సరం కంటే 2024 సంవత్సరం చాలా మెరుగ్గా ఉంది. 2023లో కేవలం రెండు కంపెనీలు మాత్రమే యునికార్న్ టైటిల్‌ సాధించాయి. ఈ సంవత్సరం భారతీయ అంకుర సంస్థల వ్యవస్థ బాగా ఊపందుకుంది, 6 కంపెనీలు యునికార్న్ క్లబ్‌లోకి అడుగు పెట్టాయి. 1 బిలియన్‌ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌ను "యూనికార్న్‌"గా పిలుస్తారు.


భారతదేశంలో వందకు పైగా యునికార్న్స్
భారతదేశంలో ఇప్పుడు మొత్తం 118 యునికార్న్‌లు ఉన్నాయి, ఇవి ఏకంగా 120 బిలియన్‌ డాలర్లకు పైగా నిధులు సేకరించాయి. 2022 (21 యూనికార్న్‌ కంపెనీలు), 2021 (42 యునికార్న్‌ కంపెనీలు) సంవత్సరాలతో పోలిస్తే 2024లో ఉద్భవించిన యూనికార్న్‌ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, 2023తో పోలిస్తే ఇది సానుకూల సంకేతం.


2024లో 6 కొత్త యునికార్న్‌లు (6 Unicorn Companies in 2024)


ఏథర్ ఎనర్జీ (Ather Energy): ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ ఏథర్ ఎనర్జీ 2024 ఆగస్టులో యునికార్న్‌గా మారింది. ఇది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) నుంచి $71 మిలియన్ల నిధులు పొందింది. ఏథర్ త్వరలో $2 బిలియన్ల వాల్యుయేషన్‌తో IPOని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ వంటి కంపెనీలతో పోటీ పడుతోంది.


కృత్రిమ్‌ (Krutrim) : భవ్య అగర్వాల్ స్థాపించిన GenAI, జనవరిలో భారతదేశపు మొట్టమొదటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (GenAI) యునికార్న్‌ టైటిల్‌ సాధించింది. ఈ కంపెనీ లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ (LLMs), AI చిప్‌లను తయారు చేసే రంగంలో పని చేస్తోంది. ఇప్పటివరకు $74 మిలియన్లు సేకరించింది. OpenAI, Google వంటి కంపెనీలతో పోటీ పడుతోంది.


మనీవ్యూ (Moneyview): ఫిన్‌టెక్ స్టార్టప్ మనీవ్యూ సెప్టెంబర్‌లో $1.2 బిలియన్ వాల్యుయేషన్‌తో యునికార్న్ హోదా సంపాదించింది. ఇది పర్సనల్ లోన్ & క్రెడిట్ ట్రాకింగ్ వంటి సేవలను అందిస్తుంది. FY24లో కంపెనీ ఆదాయం 75% పెరిగి రూ.1,012 కోట్లకు చేరుకుంది.


పెర్ఫియోస్ (Perfios): ఫిన్‌టెక్‌ SaaS కంపెనీ పెర్ఫియోస్, మార్చిలో యునికార్న్‌ క్లబ్‌లోకి అడుగు పెట్టింది. ఇది కెనడియన్ పెట్టుబడిదారు నుంచి $80 మిలియన్లు పొందింది. 18 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది & 1,000కి పైగా ఆర్థిక సంస్థలకు సేవలు అందిస్తోంది. పెర్ఫియోస్ US మార్కెట్లో IPOను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ర్యాపిడో (Rapido): బైక్‌ టాక్సీ సేవలు అందించే ర్యాపిడో.. వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి $120 మిలియన్ల నిధులు పొంది జులైలో యునికార్న్‌గా అవతరించింది. ఈ సంస్థ ఓలా, ఉబర్ వంటి సంస్థలతో పోటీ పడుతోంది. FY24లో ర్యాపిడో తన నష్టాలను 45% తగ్గించుకుంది.


రేట్‌గెయిన్ (RateGain): ట్రావెల్ & హాస్పిటాలిటీ రంగ సంస్థ రేట్‌గెయిన్‌ కూడా ఈ ఏడాది యునికార్న్‌ క్లబ్‌ మెంబర్‌గా మారింది. ఈ కంపెనీ మార్కెట్‌లో ఇప్పటికే లిస్ట్‌ అయింది. 100 దేశాలలో 3,200కి పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. FY25 రెండో త్రైమాసికంలో కంపెనీ లాభం 74% పెరిగి రూ.52 కోట్లకు చేరుకుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌